హీరోయిన్ డింపుల్ హయతి పై కేసు
టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతి పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఆమె రవితేజ తో కలిసి ఖిలాడీ సినిమాతో పాటు ఇటీవలే విడుదల అయిన గోపి చంద్ సినిమా రామబాణంలో కూడా నటించారు. హీరోయిన్ డింపుల్ హయాతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే లు జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీ లోని హుడా ఎన్ క్లేవ్ లో ఉన్న ఒకే అపార్ట్ మెంట్ లో ఉంటారు. వీళ్లకు కార్ల పార్కింగ్ దగ్గర పంచాయతీ వచ్చింది. అది కాస్త పోలీస్ కేసు వరకు వెళ్ళింది. ట్రాఫిక్ డీసీపీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్కింగ్ లో ఉన్న రాహుల్ హెగ్డే కారు ను డింపుల్ హయతి తన కార్ తో డీ కొట్టడంతో పాటు కాలితో తన్నారు అని ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై పోలీస్ లు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి 41 సిఆర్ పీసి కింద నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారంపై డింపుల్ హయతి కూడా స్పందించారు. డీసీపీ కారు ను తన కారు తో గుద్దితే తన కారు కూడా డ్యామేజ్ అవుతుంది కదా..దీనికి ఆధారాలు ఉంటే చూపించాలని ఆమె కోరారు. గన్ మెన్స్ తో ఉండే వాళ్ళను తాను ఎలా బెదిరించగలను అంటూ స్పందించారు. కోర్టు లోనే ఈ విషయాన్నీ తేల్చుకుంటానని...త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తానని తెలిపారు. ఈ గొడవ బయటకు వచ్చిన తర్వాత మీడియా అంతా వీళ్ళు నివాసం ఉండే అపార్ట్ మెంట్ కు వెళ్లగా సెల్లార్ లో ట్రాఫిక్ డివైడ్ చెయ్యడానికి ఉపయోగించే పెద్ద పెద్ద సిమెంట్ దిమ్మలు ఉండటం దుమారం రేపుతోంది. వీటితో పాటు ప్లాస్టిక్ కోన్స్ పెట్టారు . డింపుల్ హయతి లాయర్ కూడా మీడియా తో మాట్లాడారు.
ఆమె పై తప్పుడు కేసు పెట్టారు అని..రోడ్ల పై ఉండాల్సిన సిమెంట్ బ్రిక్స్ ప్రైవేట్ ప్రాపర్టీ లోకి ఎలా వస్తాయని ప్రశ్నించారు ఇదే విషయాన్ని రెండు నెలలుగా అడుగుతుంటే డింపుల్ తో డీసీపీ చాలా అమర్యాదగా మాట్లాడారు అని లాయర్ పాల్ సత్యనారాయణ మీడియా కు వివరించారు. ఆయనపై కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ వెళితే ఫిర్యాదు తీసుకోలేదు అని..మూడు గంటలు అక్కడే కూర్చోబెట్టారు అని ఆరోపించారు. ఈ తరుణంలో డింపుల్ హయతి కారు పై ఒకే సారి పెద్ద ఎత్తున చలానాలు రావటం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం పై తొలుత డీసీపీ రాహుల్ హెగ్డే కూడా మీడియా తో మాట్లాడారు తాను అధికారిక విధుల్లో భాగంగా కొన్నిసార్లు అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి ఉంటుంది అని...కానీ ఆమె కారు వల్ల తనకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పారు. ఈ విషయాన్నీ వ్యక్తిగతంగా కూడా ఆమె దృష్టికి తీసుకువెళ్లిన ఉపయోగం లేకపోవటంతో తన డ్రైవర్ కేసు పెట్టారు అని తెలిపారు. ఆమెతో తనకు ఎలాంటి వివాదం లేదు అన్నారు. పోలీస్ విచారణలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. డింపుల్ హయతి మాత్రం అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ట్వీట్ చేశారు.