తమ్ముడితో కూడా తిప్పలే!

టాలీవుడ్ లోని టాప్ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఒకప్పుడు ఆయన బ్యానర్ లో వచ్చిన సినిమాలు చాలా వరకు హిట్స్ కొట్టాయి. కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే గత కొంత కాలంగా దిల్ రాజు వరస హిట్స్ నుంచి వరస వివాదాలు..వరస ప్లాప్ ల బాట పట్టినట్లు కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సినిమాలో కంటెంట్..దమ్ము ఉంటే ఆడుతుంది తప్ప...నిర్మాతను బట్టి సినిమా ఆడదు అని మరో సారి ప్రూవ్ అయింది. దిల్ రాజు కు గేమ్ ఛేంజర్ అదే చెప్పింది. ఇప్పుడు తమ్ముడు సినిమా కూడా మరో సారి అదే విషయాన్ని ప్రూవ్ చేసింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఉన్న కథ, కామెడీ నే దిల్ రాజు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోకుండా ఆపింది. తమ్ముడు సినిమా ప్రమోషన్స్ కోసం దిల్ రాజు ఇటీవల వరసగా ఇంటర్వ్యూ లు ఇచ్చారు. ఈ సారి ఆయన సోదరుడు శిరీష్ కూడా రంగంలోకి దిగి ఇంటర్వ్యూ ల్లో రామ్ చరణ్ , డైరెక్టర్ శంకర్ ల గురించి మాట్లాడారు. రామ్ చరణ్ పై ఆయన చేసిన కామెంట్స్ కు ఆయన ఫాన్స్ గట్టి వార్నింగ్ ఇవ్వటంతో శిరీష్ లేఖ ద్వారానే కాకుండా..వీడియో ద్వారా కూడా సారీ చెప్పాల్సి వచ్చింది.
ఇద్దరూ కలిసి తమ్ముడు సినిమా ను ఒక రేంజ్ కు లేపటానికి ప్రయత్నం చేశారు. ఈ సినిమా క్రెడిట్ అంతా దర్శకుడు వేణు శ్రీరామ్ దే అని చెప్పుకొచ్చారు. కానీ ఈ సినిమా విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓపెనింగ్స్ బజ్ కూడా ఏ మాత్రం లేదు. వీకెండ్ లో తోలి రోజు అయిన శనివారం ఈవెనింగ్ షో లకు కూడా థియేటర్స్ ఫుల్ కాలేదు అంటే ఈ సినిమా రిజల్ట్ ఏంటో అర్ధం చేసుకోవటం పెద్ద కష్టం కాదు. తమ్ముడు సినిమా కు హైప్ తెచ్చేందుకు దిల్ రాజు ఎంతో ప్రయత్నం చేసినా కూడా అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో గత కొంత కాలంగా దిల్ రాజు జడ్జిమెంట్ తప్పుతోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పలు సందర్భాల్లో దిల్ రాజు స్వయంగా మీడియా ఇంటర్వ్యూల్లో చెప్పారు. సినిమా అంతా సిద్ధం అయిన తర్వాత ఒక సారి చూసుకుంటే ఆ సినిమా ఆడుతుందో లేదో తెలిసిపోతుంది అని. కానీ దిల్ రాజు గత కొన్ని సినిమాల ఫలితం చూస్తే ఆయన లెక్క తప్పుతోంది అనే కామెంట్స్ టాలీవుడ్ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.