దేవర సెన్సార్ పూర్తి
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా దేవర. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా..మంగళవారం నాడు విడుదల అయిన ఈ మూవీ ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది అనే చెప్పాలి. దేవర సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి యూఏ సర్టిఫికెట్ వచ్చింది. ఈ మధ్య కాలంలో వస్తున్న అన్ని కీలక సినిమాల తరహాలో దేవర నిడివి కూడా భారీగానే ఉంది. ఈ సినిమా ఏకంగా రెండు గంటల 57 నిమిషాల..58 సెకన్లు గా ఉంది. రెండు భాగాలుగా సినిమా తెరకెక్కిస్తున్నా కూడా ఫస్ట్ పార్ట్ నిడివి దగ్గర దగ్గర మూడు గంటలు ఉండటం విశేషం.
దేవర సినిమా చివరి నలభై నిమిషాలు ఒక రేంజ్ లో ఉంటుంది అని ఎన్టీఆర్ ఇటీవల ముంబై లో ఒక ఇంటర్వ్యూ లో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ కామెంట్స్ తో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు అనే చెప్పాలి. సెప్టెంబర్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న దేవర ఇప్పటికే అమెరికా లో ప్రీ సేల్స్ విషయంలో రికార్డు లు నమోదు చేస్తూ ముందుకు సాగుతోంది. దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ క్యారెక్టర్ చేసిన విషయం తెలిసిందే.