Telugu Gateway
Cinema

రెండు సినిమాలకు యావరేజ్ టాకే!

రెండు సినిమాలకు యావరేజ్ టాకే!
X

ఎంత పెద్ద సినిమా అయినా కూడా ఇప్పుడు నాలుగు రోజులు...మూడు రోజుల సినిమాలు గానే మారిపోతున్నాయి. రిలీజ్ తర్వాత వచ్చే మొదటి సోమవారం నాడు కూడా ఏ సినిమా అయినా మంచి బుకింగ్స్ సాధించి థియేటర్లు ఫుల్ అయ్యాయి అంటే అది సూపర్ హిట్ సినిమా కిందే లెక్క. ఈ ఆగస్ట్ 14 న బాక్స్ ఆఫీస్ దగ్గర రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమా...హృతిక్ రోషన్..ఎన్టీఆర్ లు కలిసి నటించిన వార్ 2 సినిమాలు పోటీకి దిగాయి. కీలకమైన నాలుగు రోజులుగా గడిచిపోవటంతో ఇప్పుడు విజేత ఎవరు అన్న చర్చ తెరమీదకు వచ్చింది. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఈ రెండు సినిమాలకు యావరేజ్ మూవీ లుగానే రివ్యూ లు వచ్చినా కూడా రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమానే హిట్ మూవీగా నిలిచింది అని చెప్పాలి.

అంతే కాదు ఈ సినిమా కొత్తగా పలు రికార్డు లు కూడా నమోదు చేసింది. కూలీ సినిమా కు కూడా విడుదల తర్వాత నెగిటివ్ టాక్ వచ్చిన కూడా రజనీకాంత్ ఇమేజ్ ఈ సినిమా ను ముందుకు నడిపింది అని చర్చ సాగుతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కించిన వార్ 2 ఏకంగా 4500 స్క్రీన్స్ లో విడుదల అయింది. దగ్గర 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ మూవీ ని తెరకెక్కించారు. ఈ సినిమా తొలి వారాంతంలో భారతదేశంలో ₹173 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఈ లెక్కన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించటం కష్టమే అన్న చర్చ సాగుతోంది. మరో వైపు కూలీ సినిమా 3000 థియేటర్లలో విడుదల అయింది.

కానీ ఈ సినిమా మాత్రం ఇండియా లో 194 కోట్ల రూపాయల నికర వసూళ్లు సాధించినట్లు లెక్కలు బయటకు వచ్చాయి. వార్ 2 తో పోలిస్తే కూలీ సినిమానే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా దుమ్మురేపుతోంది. ఈ రెండు సినిమాలకు మధ్య గ్యాప్ కూడా చాలా ఎక్కువే ఉంది. వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ ఉన్నా ..అతి పెద్ద హిందీ మార్కెట్ ఉండి కూడా కూలీ కంటే వార్ 2 ఎంతో వెనకబడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 74 సంవత్సరాల వయస్సు ఉన్న రజనీకాంత్ ఫ్యాన్స్ కు ఉండే లాయల్టీ కూడా కూలీ విజయంలో కీలక పాత్ర పోషించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోమవారం నాడు ఈ రెండు సినిమాలకు బుకింగ్ గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఉన్నంతలో కూలీ కే ఎక్కువ బుకింగ్స్ ఉన్నాయి.

Next Story
Share it