దసరాకు ఇక ఓన్లీ ఓజీనే

ప్రచారమే నిజం అయింది. అఖండ 2 తాండవం సినిమా విడుదల వాయిదా పడింది. చిత్ర యూనిట్ గురువారం నాడు అధికారికంగా ఈ విషయం వెల్లడించింది. దసరా సెలవులే టార్గెట్ గా బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ ని తొలుత సెప్టెంబర్ 25 న విడుదల చేయాలని నిర్ణయించారు. అదే రోజు పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఓజీ మూవీని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి వాయిదా తప్పదు అని ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు అఖండ 2 విడుదల వాయిదా పడటంతో ఓజీ సినిమా సోలో గా దసరా సెలవుల్లో పండగ చేసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సినిమా పై అంచనాలు కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. అఖండ 2 సినిమాకు సంబంధించి రీ రికార్డింగ్, వీఎఫ్ఎక్స్ తో పాటు మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పూర్తి స్థాయి దృష్టి పెట్టి పూర్తి చేయాల్సి ఉన్నందున సినిమా విడుదల వాయిదా వేయటం తప్పటం లేదు అని చిత్ర యూనిట్ తెలిపింది. అఖండ సినిమా సూపర్ హిట్ కావటంతో ఇప్పుడు అఖండ 2 అంచనాలు కూడా ఎంతో పెరిగాయి అని...ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని వెల్లడిస్తామని తెలిపారు. కొద్ది రోజుల పాటు అటు అఖండ 2 చిత్ర యూనిట్ తో పాటు ఓజీ చిత్ర యూనిట్ కూడా తమ సినిమా విడుదల తేదీ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు అని చెపుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు అఖండ 2 వెనక్కి తగ్గింది.



