సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అయిందా?!(Daku Maharaaj Movie Review)
నందమూరి బాలకృష్ణ కు సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ. వీలు ఉన్న ప్రతి సారి సంక్రాంతి బరిలో తన సినిమా ఉండేలా చూసుకుంటాడు. ఈ సారి కూడా డాకుమహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2023 లో చిరంజీవికి వాల్తేర్ వీరయ్య వంటి కమర్షియల్ హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీ కొల్లి ఈ సారి బాలకృష్ణ సంక్రాంతి సినిమా డాకుమహారాజ్ తెరకెక్కించటంతో అందరిలో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. అదే సమయంలో బాలకృష్ణ కూడా గత కొంత కాలంగా వరసగా మంచి హిట్స్ దక్కించుకుంటూ వెళుతున్నాడు. దర్శకుడు బాబీ కొల్లి కథ కంటే కమర్షియల్ ఎలిమెంట్స్ పైనే దృష్టి పెట్టి ఈ సినిమాను తెరకెక్కించాడు అని చెప్పాలి. సినిమా కథ విషయానికి వస్తే ఇది కూడా పాత రొటీన్ కథే.
అదే మైనింగ్, అదే డ్రగ్స్ మాఫియా..మంత్రుల అండదండలు. ఒక ఇంజనీర్ గా ఉన్న బాలకృష్ణ డాకుమహారాజ్ గా ఎందుకు మారాడు అన్నదే ఈ సినిమా. కథ గురించి చెప్పాల్సి వస్తే కచ్చితంగా ఇది ఇందులో ఏ మాత్రం కొత్తదనం లేదు అనే చెప్పాలి. అయితే దర్శకుడు బాబీ కొల్లి మాత్రం బాలకృష్ణ అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో జొప్పించి ఈ సినిమాను తెరకెక్కించాడు. డాకుమహారాజ్ ఫస్ట్ హాఫ్ సినిమా దుమ్ము రేపితే ...సెకండ్ హాఫ్ స్లో అయి పోతుంది. ఫస్ట్ హాఫ్ లో డాకుమహారాజ్ ఎలివేషన్స్, యాక్షన్స్ సీన్స్ తో సినిమా ఒక రేంజ్ కు వెళుతుంది. ఒక సాదాసీదా కథను ఫస్ట్ హాఫ్ లో థమన్ తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఎక్కడికో తీసుకెళ్లాడు. నిజంగా థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో తన సత్తాచాటి ఉండకపోతే డాకుమహారాజ్ కథ దారుణంగా ఉండేది అని చెప్పొచ్చు.
అసలు కథ అంతా సెకండ్ హాఫ్ లో చూపించారు. దీంతో సినిమా ఫస్ట్ హాఫ్ లో ఉన్న జోష్ అంతా మిస్ అయి ఒక్కసారిగా స్లో అవుతుంది. నందమూరి బాలకృష్ణ తనకు అలవాటు అయిన మాస్ పాత్రలో దుమ్మురేపాడు. అయితే బాలకృష్ణ కు జోడిగా నటించిన ప్రగ్యా జైస్వాల్ పాత్ర ఈ సినిమాలో పరిమితగానే ఉంది. మరో నటి శ్రద్దా శ్రీనాథ్ సినిమాలో కనిపించేది కొద్దిసేపే అయినా ఆమెది కీలక పాత్ర. సినిమాలో ఫస్ట్ హాఫ్ విలన్ గా రవి కిషన్ కనిపిస్తే..సెకండ్ హాఫ్ లో అసలు విలన్ గా బాబీ డియోల్ సెట్టిల్డ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటాడు.
ఊర్వశీ రౌటేలా దబిడి దిబిడి సాంగ్ మినహా ఈ సినిమాలో ఎలాంటి డ్యూయెట్స్ పెట్టలేదు దర్శకుడు. అయితే దర్శకుడు బాబీ కొల్లి ఈ సినిమా ద్వారా హింసను మరో ఎత్తుకు తీసుకువెళ్లాడు అనే చెప్పొచ్చు. ఫైటింగ్స్ లో తలలు తెగనరకటమే కాకుండా...మేక మాంసం కొట్టినట్లు మనిషి ని కూడా ముక్కలు ముక్కలు చేసినట్లు చూపించి ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు. వీటికి తోడు ఆసుపత్రిలో అవసరంలేని బూతు డైలాగులు అదనం. ఈ విషయాలు పక్కన పెడితే బాలకృష్ణ ఫ్యాన్స్ కు మాత్రం డాకుమహారాజ్ పండగ సినిమా అనే చెప్పాలి. రొటీన్ కథ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఇంతగా ఎలివేషన్ వచ్చింది అంటే ఇందులో సింహభాగం క్రెడిట్ థమన్ కే దక్కుతుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.
రేటింగ్ : 2 .75 - 5