బాక్స్ ఆఫీస్ దగ్గర బాలకృష్ణ మూవీ జోష్
బాలకృష్ణ నటించిన డాకుమహారాజ్ వంద కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళుతోంది. జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 92 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా వెల్లడించింది. సంక్రాంతి సీజన్ లో బాలకృష్ణ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంటే అది పక్కా హిట్ అన్నట్లు గా మారింది పరిస్థితి గత కొన్ని సంవత్సరాలుగా. అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన డాకుమహారాజ్ కూడా మంచి కమర్షియల్ హిట్ సినిమాగా నిలిచింది.
ఈ సినిమా విజయంలో బాలకృష్ణ యాక్షన్ తో పాటు థమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది అనే చెప్పాలి. ఈ సంక్రాంతి సీజన్ లో మొత్తం మూడు సినిమా లు ప్రేక్షకుల ముందుకు రాగా బాలకృష్ణ సినిమా మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. అయితే డాకుమహారాజ్ సినిమాకు సరిపడినన్ని థియేటర్లు లేవు అనే ప్రచారం తెరమీదకు వచ్చింది. ముఖ్యం గా బాలకృష్ణ ఫ్యాన్స్ ఇదే విషయంపై సోషల్ మీడియా వేదికగా నిర్మాత నాగవంశీపై విమర్శలు చేస్తున్నారు. మంచి సినిమా తెరకెక్కించటమే కాదు...సినిమాకు థియేటర్లు దక్కేలా కూడా చూసుకోవాలి అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.