అనిల్ రావిపూడి దూకుడు

దర్శకుడు అనిల్ రావిపూడి ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయన తెరకెక్కించిన సినిమాలు అన్ని వరసగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో రికార్డు లు నమోదు చేయటంతో పాటు ఏకంగా మూడు వందల కోట్ల రూపాయల పైన గ్రాస్ వసూళ్లను సాధించింది. అదే జోష్ తో ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయనున్నారు. ఈ సినిమా కు సంబంధించి ఆయన బుధవారం నాడు కొత్త అప్డేట్ ఇచ్చారు. తమ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కున్న సినిమా ఫైనల్ స్క్రిప్ట్ పూర్తి అయింది అని...దీన్ని లాక్ చేశామని, త్వరలోనే శంకర వరప్రసాద్ ను పరిచయం చేయబోతున్నట్లు వెల్లడించారు.
చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్ అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు శంకర వరప్రసాద్ అని స్పష్టం చేశారు. త్వరలోనే ముహూర్తం ఫిక్స్ చేసి చిరు నవ్వుల పండగ బొమ్మకు శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు నాని దసరా సినిమా ను తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల తో కూడా మరో సినిమా కు ఓకే చేశారు. అయితే ఫస్ట్ అనిల్ రావిపూడి సినిమా ను పూర్తి చేసే అవకాశం ఉంది. ఎప్పటి లాగానే అనిల్ రవి ఈ సినిమా ను కూడా తనకు కలిసివచ్చిన సంక్రాంతి సీజన్ అంటే 2026 సంక్రాంతికి తీసుకువచ్చే అవకాశం ఉంది.