సినిమా టిక్కెట్ రేట్లు పెంచారు..థ్యాంక్స్
ఏపీది ఓ దారి అయితే...తెలంగాణది మరోదారి. ఏపీ సర్కారు సినిమా టిక్కెట్ రేట్లు పెంచేది లేదు అంటూ తేల్చిచెబుతోంది. అంతే కాదు..హీరోల రెమ్యునరేష్ ఎంత?. సినిమా నిర్మాణ వ్యయం ఎంత అంటూ ప్రశ్నలు సంధిస్తోంది. హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటే ప్రస్తుతం ఉన్న సినిమా టిక్కెట్లు సరిపోతాయి అంటూ టాలీవుడ్ కు కౌంటర్ ఇస్తున్నారు ఏపీ మంత్రులు. అయితే తెలంగాణ సర్కారు మాత్రం అందుకు భిన్నంగా వెళుతోంది. పరిశ్రమ కోరిక మేరకు తెలంగాణ సర్కారు తాజాగా సినిమా టిక్కెట్ రేట్లను భారీగా పెంచింది. దీంతో సర్కారుకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కూడా పెరగనుంది. అయితే తెలంగాణ సర్కారు పెంచిన రేట్లు మరీ ఎక్కువగా ఉన్నాయని కొంత మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కూడా.
తెలంగాణ సర్కారు రేట్ల పెంపు నిర్ణయంపై హీరో చిరంజీవి స్పందించారు. తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు కృతఙ్ఞతలు తెలిపారు. సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇదే చిరంజీవి కొద్ది రోజుల క్రితం ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం జగన్ ను కూడా పరిశ్రమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. కానీ సీఎం జగన్ ఇదేమీ పట్టించుకోలేదు.