ఎల్ బీ నగర్ స్టేషన్ లో రాష్ట్రీయ వానర సేన ఫిర్యాదు

సంచలన దర్శకుడు రాజా మౌళి చిక్కుల్లో పడ్డారు. ఆయనపై హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు అయింది. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీ లో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో ఆయన దేవుళ్లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. సోషల్ మీడియా లో కూడా దర్శకుడు రాజ మౌళి విమర్శలు వెల్లువెత్తాయి. ఒక వైపు దేవుడిని నమ్మను అని చెపుతూ దేవుడి కధాంశముతో సినిమాలు తీసేది డబ్బు చేసుకోవటం కోసమేనా అంటూ చాలా మంది విమర్శలు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ..హనుమంతుడిపై రాజమౌళి చేసిన కామెంట్స్ పై ఇప్పుడు ఫిర్యాదు నమోదు అయింది. రాజమౌళిపై రాష్ట్రీయ వానర సేన పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ ఫిర్యాదు ఆధారంగా రాజమౌళిపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఎవరూ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. నవంబర్ 15వ తేదీన హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రాజమౌళి, మహేష్ బాబు సినిమా వివరాల వెల్లడి కోసం ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమం సందర్భంగా సాంకేతిక సమస్య తలెల్తింది. రాజమౌళి దీంతో ఒకింత బాధతో పాటు అసహనానికి గురయ్యారు. స్టేజి మీద మాట్లాడుతూ.. ‘నాకు దేవుడి మీద నమ్మకం లేదు. నా తండ్రి విజయేంద్రప్రసాద్ నాతో మాట్లాడుతూ..‘టెన్షన్ పడకు. అంతా హనుమంతుడు చూసుకుంటాడు. వెనకుండి నడిపిస్తాడు’ అన్నారు. కానీ, సాంకేతిక లోపం కారణంగా ఈవెంట్ ఆగినపుడు ఇలాగేనా నడిపించేది అని కోపం వచ్చింది. నా భార్య రమాకు కూడా హనుమాన్ అంటే చాలా ఇష్టం. కానీ, ఎందుకిలా అయిందని నాకు కోపం వచ్చింది’ అని వ్యాఖ్యానించారు. ఇదే సోషల్ మీడియా లో రాజ మౌళి ట్రోలింగ్ కు కారణం అయింది. రాష్ట్రీయ వానర సేన ఫిర్యాదు పై పోలీస్ లు విచారణ చేస్తున్నట్లు సమాచారం.
మరో వైపు ఇప్పుడు కొత్తగా ఈ టైటిల్ పై కూడా వివాదం మొదలైంది. ఫిల్మ్ చాంబర్‌లో వారణాసి టైటిల్‌పై ఫిర్యాదు నమోదు అయింది. ఆ టైటిల్ తమకు ఎప్పుడో రిజిస్టర్ అయిందని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. మహేష్ బాబు హీరోగా భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తుంటే..ప్రముఖ మలయాళ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా తలెత్తిన వివాదం టీ కప్పులో తుఫాను లాగా సమసిపోవుతుందా ...రాజ మౌళి ఏమైనా క్షమాపణ చెపుతారా అన్నది వేచిచూడాలి. గతంలో కూడా రాజమౌళి సినిమాల కథల విషయంలో పలు వివాదాలు తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే.



