శర్వానంద్ హిట్ ట్రాక్ కొనసాగించాడా?!

చాలా కాలం పాటు వరసగా ప్లాప్స్ తో ఇబ్బంది పడిన హీరో శర్వానంద్ ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి నారీ నారీ నడుమ మురారి సినిమాతో హిట్ దక్కించుకున్నాడు. సంక్రాంతి బరిలో అందరి కంటే చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా తన ఖాతాలో హిట్ వేసుకున్నాడు. శర్వానంద్ ఇప్పుడు బైకర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దేశంలోనే మొదటి సారి మోటో క్రాస్ రేసింగ్ సినిమాగా బైకర్ అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా విడుదల శుక్రవారం నాడే అయినా గురువారం రాత్రి నుంచే పెయిడ్ ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ఒక కీలక పాత్రలో ఇందులో కనిపించారు. బైకర్ లో రాజశేఖర్ హీరో శర్వానంద్ తండ్రి పాత్రలో కనిపిస్తాడు. దేశంలో క్రికెట్ కు తప్ప మిగిలిన ఆటలకు అంతగా ప్రాధాన్యత దక్కదు అనే విషయం అందరికి తెలిసిందే. ఒకప్పటి మోటో క్రాస్ రేసర్ గా రాజశేఖర్ ఇండియాలో ఈ గేమ్ కు కూడా ఆదరణ దక్కేలా చేయటంతో పాటు స్పాన్సర్స్ వచ్చేలా చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. హీరో శర్వానంద్ కూడా తన తండ్రి దగ్గరే శిక్షణ పొంది ఇందులో నంబర్ వన్ అనిపించుకుంటాడు.
తర్వాత శర్వానంద్ పూర్తిగా రేసింగ్ కు దూరం అవుతాడు. తండ్రికి తెలియకుండా తన ప్రేయసి మాళవిక నాయర్ ను పెళ్లి చేసుకుని రేసింగ్ కు దూరంగా ఉంటాడు. తర్వాత తన భార్యకు ఏ మాత్రం ఇష్టం లేకపోయినా కూడా హీరో మళ్ళీ రేసింగ్ ట్రాక్ ఎందుకు ఎక్కాడు...తర్వాత ఏమి జరిగింది అన్నదే బైకర్ మూవీ. ప్రతి ఆటలో ఉన్నట్లు ఇందులో కూడా కార్పొరేట్ పాలిటిక్స్ కూడా చూపించారు. బైకర్ మూవీ రోల్ కోసం శర్వానంద్ పడిన కష్టం ఏంటో ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పాత్రకు పక్కాగా సెట్ అయ్యేలా తనను తాను మలుచుకున్నాడు. సీనియర్ రేసర్ గా..ట్రైనర్ గా రాజశేఖర్ తన అనుభవంతో సెటిల్డ్ గా తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు అనే చెప్పాలి. మూవీలో రేసింగ్ సన్నివేశాలు ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఇవి ప్రేక్షలను థ్రిల్ ఫీల్ అయ్యేలా చేస్తాయి. శర్వానంద్, హీరోయిన్ మాళవిక నాయర్ ల లవ్ ట్రాక్ రొటీన్ గా ఉంటుంది. ఈ రేసింగ్ మూవీ లో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా జొప్పించారు.
ఇందులో హీరో శర్వానంద్ తన తండ్రి రాజశేఖర్ పై ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేస్తే ఏ మాత్రం సహించడు. అలాగే శర్వానంద్ కొడుకు కూడా తన తండ్రిని ఎవరైనా ఏమైనా అంటే వాళ్లపై ఏకంగా దాడి చేస్తాడు. ఈ ఎమోషన్స్ మధ్య లింక్ పెట్టిన కథ నడిపించిన తీరు పర్వాలేదు అనిపిస్తుంది. ఈ సినిమాలో హై లైట్ అంటే రేసింగ్ విజువల్స్...శర్వానంద్, రాజశేఖర్ నటనే చెప్పాలి. ఈ సినిమా కథలో చాలా వరకు పాత సినిమాలు గుర్తుకు వచ్చేలా సన్నివేశాలు ఉంటాయి తప్ప కొత్తదనం లేదు. జిబ్రాన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు వచ్చినా.. మోటోక్రాస్ రేసింగ్ అనే పాయింట్‌తో ఇప్పటి వరకు ఎవరూ సినిమాను తెరకెక్కించకపోవటంతో దర్శకుడు అభిలాష్ రెడ్డి చేసిన ప్రయత్నంలో కొంత కొత్తదనం కనిపిస్తుంది అని చెప్పాలి. రెగ్యులర్ ప్రేక్షకుల కంటే యూత్ కు ఈ సినిమా ఎక్కువ కనెక్ట్ అవటానికి అవకాశం ఉంటుంది.



