పెళ్లి ఫోటో లు విడుదల

టాలీవుడ్ హీరోయిన్ సమంత సోమవారం నాడు పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి విషయాన్ని ఆమె అధికారికంగా దృవీకరించారు. తన పెళ్ళికి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టా లో షేర్ చేసుకున్నారు. దీంతో సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు పెళ్లిపై ఇప్పటి వరకు వచ్చిన అనధికారిక వార్తలు అన్ని నిజం అయ్యాయి. వీళ్ళిద్దరూ గత కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నారు. తరచూ విదేశీ పర్యటనలు చేస్తూ ఆ ఫోటో లను కూడా సోషల్ మీడియా లో షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. కోయంబత్తూరు లోని ఈషా యోగ కేంద్రంలో ఉన్న లింగ భైరవి సన్నిధిలో భూత శుద్ధి వివాహం చేసుకున్నట్లు ఈషా ఫౌండేషన్ కూడా ఒక ప్రకటనలో వెల్లడించింది. కుటుంబ సభ్యులు...అత్యంత సన్నిహితుల మధ్య ఈ కార్యక్రమం జరిగింది.
అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి నిర్వహించినట్లు తెలిపారు. ఆలోచనలు, భావోద్వేగాలు, భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పర్చటానికి రూపొందించిన విశిష్టమైన ప్రక్రియే ఈ భూత శుద్ధి వివాహం అని తెలిపారు. లింగ భైరవి ఆలయంతో పాటు ఎంపిక చేసిన దేవాలయాల్లో మాత్రమే నిర్వహించే ఈ క్రతువు వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తుంది...వారి దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దేవి అనుగ్రహం ప్రసాదిస్తుంది అని వెల్లడించారు. ఈషా ఫౌండేషన్ సమంత, రాజ్ జంటకు విషెష్ చెపుతూ....దేవి అనుగ్రహంతో వీరి జీవితం ఆనందమయంగా సాగాలని కోరుకుంది.



