శర్వానంద్ మాస్ ప్రయోగం ఫలించిందా?!(Bhogi Movie Review)

ఈ ఏడాది సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి సినిమాతో హిట్ అందుకున్నాడు హీరో శర్వానంద్. సంక్రాంతి బరిలో పోటీ తీవ్రంగా ఉన్నా కూడా ఈ సినిమా మంచి ఫలితాన్ని రాబట్టింది. తర్వాత విడుదల అయిన శర్వానంద్ మూవీ బైకర్ మాత్రం నిరాశనే మిగిల్చింది. ఫస్ట్ టైం శర్వానంద్ ఊర మాస్ పాత్రతో భోగి సినిమాతో ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శర్వానంద్ ఇప్పటి వరకు చేసింది ఎక్కువ రొమాంటిక్...ఎంటర్ టైన్మెంట్ మూవీసే. అంతగా ఫార్మ్ లో లేని దర్శకుడు సంపత్ నంది తో కలిసి తొలిసారి శర్వానంద్ మాస్ సినిమా చేయటంతో ఈ మూవీ ఎలా ఉంటుందో అనే అనుమానాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. అందుకే ఫస్ట్ డే ఫస్ట్ షో లకు కూడా ఓపెనింగ్స్ అంత ఆశాజనకంగా లేవు. మాస్ ఇమేజ్ కోసం శర్వానంద్ చేసిన సినిమానే ఈ భోగి మూవీ. సినిమా కథ ఏంటి ఆదిలాబాద్ జిల్లాలోని బొగ్గుల గుట్ట అనే గ్రామంలో తన ఐదుగురు చెల్లెళ్లతో ఉంటాడు హీరో . వాళ్లకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటూ ఉంటాడు. ఆ ఊరు మొత్తాన్ని పటేల్ తన కనుసైగలతో శాసిస్తూ ఉంటాడు. ఆ ఊళ్ళో వాళ్ళు అంతా కూడా పటేల్ ఏది చెపితే అది చేయటం తప్ప...ఎందుకు...ఏమిటి అనే ప్రశ్న కూడా వేయరు.
కానీ ఒక సారి శర్వానంద్ పటేల్ మాటకు ఎదురుతిరుగుతాడు. తాను పటేల్ చెప్పినట్లు చేయనని...ఊరిలో ఎవరూ కూడా పటేల్ చెప్పిన పని చేయకుండా అడ్డుకుంటానని శపథం చేస్తాడు. అదే ఊరిలో హీరో ఇంటి పక్కనే ఉంటుంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇల్లు కూడా. నిత్యం ఇద్దరూ ఫైట్ చేసుకుంటూ ఉంటారు కానీ..ఒకరంటే ఒకరికి ప్రేమ. పటేల్ కు ఎదురుతిరిగిన తర్వాత హీరో కు ఎదురైన కష్టాలు ఏంటి...వాటినుంచి బయటపడి...పటేల్ అధిపత్యానికి హీరో చెక్ పెట్టాడా లేదా అన్నదే ఈ మూవీ. హీరో శర్వానంద్ గంగా పాత్రలో తన నటనతో ఆకట్టుకున్నాడు. అచ్చమైన పల్లెటూరి యువకుడిగా తన హావభావాలతో మంచి నటన చూపించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా శర్వానంద్ నటన ఆకట్టుకుంటుంది. కాకపోతే ఈ సినిమాలో ప్రేక్షకులకు ఎదురయ్యే అది పెద్ద సమస్య అంటే శృతి మించిన హింసే. మాస్ సినిమా అంటే చాలు తలలతో పాటు బాడీ పార్ట్శ్ తెగ నరకటమే అన్న చందంగా మారిపోయింది టాలీవుడ్ లో పరిస్థితి.
భోగి లో కూడా అలాగే భయపెట్టారు ప్రేక్షకులను. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో కందుల సులోచన రాణి పాత్రలో తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. అటు హీరో తో పాటు హీరోయిన్ పటేల్ దగ్గర కు వెళ్లి సవాల్ విసిరే సన్నివేశాల్లో భీమ్స్ సిసిరోలియో దుమ్మురేపాడు అనే చెప్పాలి. బ్యాగ్రౌండ్ స్కోర్ భోగి మూవీ కి కీలకంగా మారింది అనే చెప్పాలి. సినిమాలో పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కథలో పెద్దగా ట్విస్ట్ లు లేకపోయినా కూడా క్లైమాక్స్ లో రివీల్ అయ్యే విషయం మాత్రం ఒకింత ఆసక్తికరంగా ఉంటుంది. దేహమే దేవాలయం అయినప్పుడు మనిషే దేవుడితో సమానం అని..అలాంటిది ఆచారాల పేరుతో నర బలి ఏ మాత్రం సరికాదు అనే సందేశంతో భోగి మూవీని ముగిస్తాడు దర్శకుడు సంపత్ నంది. ఈ సినిమాలో శరత్ లోహితాస్వ, డింపుల్ హయతి, రోహిత్ పాఠక్, నారాయణ్ రవీంద్ర ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇందులో కీలక నటీనటులు అందరి యాక్షన్ బాగున్నా కూడా మితిమీరిన హింసే సినిమాకు మైనస్ గా మారింది.



