'ఆర్ఆర్ఆర్' కు మళ్ళీ బీమ్లానాయక్ టెన్షన్ తప్పదా?!
మళ్ళీ టెన్షన్ తప్పేలా లేదు. కరోనా కేసులు తగ్గుముఖం పడితే పర్వాలేదు. లేదంటే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయిన వారం కూడా పూర్తి కాకముందే బీమ్లానాయక్ విడుదల తేదీ ప్రకటించింది. దీంతో థియేటర్లతోపాటు పలు రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గతంలోనూ ఇదే పరిస్థితి రావటంతో అతి కష్టం మీద సర్దుబాటు చేశారు. కానీ అటు ఆర్ఆర్ఆర్ రాలేదు..ఇటు బీమ్లా నాయక్ విడుదల కాలేదు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మార్చి 25న సినిమా విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. దీని కోసం ఆచార్య సినిమా ఏప్రిల్ 1న రావాల్సింది 29కి మారింది. అయితే బీమ్లానాయక్ ముందు ఆర్ఆర్ఆర్ ప్రకటించినట్లుగానే రెండు ఆప్షన్లు ఉంచుకుంది. అంతా సవ్యంగా ఉండి..కరోనా కేసులు తగ్గితే బీమ్లానాయక్ ఇంతకు ముందు ప్రకటించినట్లు ఫిబ్రవరి 25న విడుదల కానుంది. అప్పటికి పరిస్థితులు అనుకూలంగా లేకపోతే మాత్రం ఏప్రిల్ 1న విడుదల అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
కారణాలు ఏదైనా బీమ్లానాయక్ ఏప్రిల్ 1కి మారితే మాత్రం మళ్ళీ రెండు సినిమాల మధ్య పోటీ అనటం కంటే...థియేటర్ల సమస్య రావటం ఖాయం. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమా మంచి టాక్ సాధిస్తే మాత్రం కనీసం రెండు వారాల పాటు మంచి వసూళ్లు ఉంటాయి. అయితే బీమ్లానాయక్ ఏప్రిల్ 1కి మారితే మాత్రం కథ మళ్లీ మొదటికి వచ్చినట్లు అవుతుంది. దీంతో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఇప్పుడు చేయాల్సింది ఫిబ్రవరి 15 నాటికి అంతా సాధారణ స్థితికి రావాలని దేవుడిని ప్రార్ధించటమే. మరి ఇది జరిగే పనేనా?. వేచిచూడాల్సిందే. బీమ్లానాయక్ విడుదల అయ్యే తేదీ నాటికి అయినా ఏపీ సర్కారు సినిమా టిక్కెట్ ధరలపై ఓ నిర్ణయానికి వస్తుందా అన్నది వేచిచూడాల్సిందే.