ముగ్గురు హీరోల యాక్షన్ మూవీ (Bhairavam Movie Review)

ముగ్గురు హీరో లు. ఈ ముగ్గురికి సరైన హిట్ లేక చాలా కాలమే అయింది. మంచు మనోజ్ సినిమా చేయకే కొన్ని సంవత్సరాలు అయిన సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ అప్పుడప్పుడు వెండి తెరపై కనిపిస్తున్నా హిట్స్ మాత్రం పలకరించడం లేదు. నారా రోహిత్ మధ్యలో ఒక పొలిటికల్ సినిమా చేసినా ...చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వెండి తెరపై కనిపించాడు. మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ లు కలిసి చేసిన సినిమానే భైరవం. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సినిమా గరుడన్ కు రీమేక్ ఈ భైరవం మూవీ. ఈ సినిమా లో బెల్లంకొండ శ్రీనివాస్ కు జోడిగా అదితి శంకర్ నటిస్తే..మంచు మనోజ్ కు జోడిగా ఆనంది, నారా రోహిత్ భార్యగా దివ్య పిళ్ళై నటించారు. ఇక సినిమా స్టోరీ కి వస్తే అప్పటి వరకు ఎవరి కన్ను పడని దేవుడి మాన్యం భూములపై ఒక మంత్రి కన్ను పడుతుంది. ఈ భూముల విలువ ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలు ఉండటంతో ..ఆ మంత్రి తన అధికారాన్ని అంతా ఉపయోగించి ఎలాగైనా వీటిని దక్కించుకోవాలని చూస్తాడు.
అయితే ఈ వారాహి అమ్మవారి భూములను , అమ్మవారి నగలకు మంచు మనోజ్, నారా రోహిత్ లు రక్షిస్తూ వస్తుంటారు. ఈ దేవుడి మాన్యం భూముల విషయంలో ప్రాణ స్నేహితులుగా ఉన్న మంచు మనోజ్, నారా రోహిత్ ల మధ్య విబేధాలు ఎందుకు వస్తాయి...చివరికి మంత్రి తాను కోరుకున్నట్లు భూములు దక్కించుకున్నాడా లేదా అన్నదే సినిమా. అనాథ అయిన బెల్లంకొండ శ్రీనివాస్ కూడా వీళ్లతోనే కుటుంబ సభ్యుడిలా కలిసి ఉంటాడు. భైరవం సినిమా ను తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాకు హైప్ తీసుకురావటంలో సక్సెస్ అయ్యారు కానీ..సినిమా ను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో విఫలం అయ్యారు అనే చెప్పొచ్చు. దేవుడి గుడికి చెందిన భూములు...నగలు చుట్టూ తిరిగే కథతో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. దీంతో కథలో పెద్ద గా సత్తా లేదు అనే విషయం తేలిపోయింది. అయితే ఈ సినిమాలో మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ లు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నటన విషయంలో తమ సత్తా చూపించారు. సెకండ్ హాఫ్ లో అయితే బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ కొన్ని సార్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. బెల్లంకొండ, అదితి శంకర్ ల లవ్ ట్రాక్ మాత్రం పెద్దగా వర్క్ అవుట్ కాలేదు అనే చెప్పొచ్చు.
ఈ సినిమాలో వెన్నెల కిషోర్ పాత్ర పరిమితమే అయిన ఉన్నంతలో కాసేపు నవ్విస్తాడు తన బాషా ప్రావీణ్యం ద్వారా. యాక్షన్ పరంగా ముగ్గురు హీరో లు శక్తివంతమైన పాత్రల్లో మంచి నటన కనపర్చినా కథలో డెప్త్ లేకపోవటంతో ఇది అంతగా ఆకట్టులేకపోయింది అనే చెప్పాలి. యాక్షన్ సన్నివేశాలు అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ తన నుదిటిన బొట్టు పడిన ప్రతిసారి పూనకంతో చేసే సన్నివేశాలు సినిమా కు హై లైట్ గా చెప్పొచ్చు. పూర్తి స్థాయి యాక్షన్ సినిమా లను ఎంజాయ్ చేసే వాళ్లకు ఇది నచ్చుతుంది. అయితే భైరవం సినిమా లో నటన ద్వారా ఈ ముగ్గురు హీరో లకు మాత్రం రాబోయే రోజుల్లో మంచి పాత్రలు దక్కే అవకాశం ఉంది చెప్పొచ్చు.
రేటింగ్ : 2 .75 /5