Telugu Gateway
Cinema

ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ లో చిచ్చు..బరిలో బండ్ల గణేష్‌

ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ లో చిచ్చు..బరిలో బండ్ల గణేష్‌
X

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల వ్య‌వ‌హ‌రం కొత్త మ‌లుపు తిరిగింది. ఇంత కాలం ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ కు మ‌ద్ద‌తు తెలుపుతూ ఆ ప్యాన‌ల్ అధికార ప్ర‌తినిధిగా ఉన్న బండ్ల గ‌ణేష్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. తాను ప్యాన‌ల్ నుంచి వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల త‌ప్పుకుంటున్న‌ట్లు ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. త‌ర్వాత అస‌లు విష‌యం కూడా బ‌హిర్గ‌తం చేశారు. జీవిత రాజ‌శేఖ‌ర్ ను ప్ర‌కాష్ రాజ్ త‌న ప్యాన‌ల్ లోకి తీసుకోవ‌టం త‌న‌కు న‌చ్చ‌లేద‌న్నారు. చిరంజీవి ఫ్యామిలీని ఆమె గ‌తంలో చాలాసార్లు అవ‌మానించార‌ని పేర్కొన్నారు. అందుకే తాను కూడా జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రి గా పోటీచేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వాస్త‌వానికి జీవిత రాజ‌శేఖ‌ర్, హేమ‌లు మా ఎన్నిక‌ల్లో ప్రెసిడెంట్లుగా పోటీచేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ప్ర‌కాష్ రాజ్ జోక్యం చేసుకుని వారితో మాట్లాడారు. తాము చెప్పిన దానికి వారు కూడా అంగీక‌రించి క‌ల‌సి ప‌నిచేద్దామ‌న్నార‌ని ఇటీవ‌ల నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశం తెలిపారు. జీవిత‌కు అత్యంత కీల‌క‌మైన జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ పోస్టు కేటాయించారు కూడా.

ఇదే ఇప్పుడు విభేదాల‌కు కార‌ణ‌మైన‌ట్లుగా తెలుస్తోంది. మ‌రి వారిని ఒప్పించి తీసుకువ‌చ్చిన ప్ర‌కాష్ రాజ్ ఇప్పుడు త‌మ ప్యాన‌ల్ లోని..త‌మ వాడు అయిన బండ్ల గణేష్ టార్గెట్ జీవితగా బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించటంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఇది ప్ర‌కాష్ రాజ్ కు కూడా ఇబ్బందిక‌ర ప‌రిణామంగానే మా వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దీంతో మా ఎన్నిక‌ల వ్య‌వ‌హ‌రం కొత్త మ‌లుపు తిరిగిన‌ట్లు అయింది. అయితే బండ్ల గణేష్ తిరుగుబాటు మెగా ఫ్యామిలీ అండ‌తో జ‌రుగుతుందా? లేక ఆయ‌న సొంతంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నారా? అన్న అంశం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ కే మెగా ఫ్యామిలీ మ‌ద్ద‌తు ప‌లుకుతోంది. ఈ విష‌యాన్ని నాగ‌బాబు స్వ‌యంగా వెల్ల‌డించారు కూడా.

Next Story
Share it