పెద్ది మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ద మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపింది. ఈ మూవీ ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 135 .36 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. జూన్ మూడు రాత్రి వేసిన ప్రీమియర్ షోస్ తో కలుపుకుని ఈ మొత్తం వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ టికెట్ ధరను 600 రూపాయలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ ఛాంపియన్ అంటూ చిత్ర యూనిట్ ఫస్ట్ డే వసూళ్లతో కూడిన పోస్టర్ ను విడుదల చేసింది. ముఖ్యంగా పెద్ది మూవీ లో హీరో రామ్ చరణ్ యాక్షన్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మొత్తం సినిమా ఫలితంపై మిశ్రమ స్పందనలు వ్యక్తం అవుతున్నా కూడా రామ్ చరణ్ యాక్షన్ కు మాత్రం మంచి పేరు వచ్చింది అనే చెప్పాలి. సానా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో రామ్ చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ నటించింది. గత తెలుగు సినిమాల తరహాలోనే ఈ సినిమాలో కూడా జాన్వీ కి ఏ మాత్రం ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కలేదు.
పైగా ఆమె గ్లామర్ ఆరబోతపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఒక గ్రామ సమస్యకు...స్పోర్ట్స్ కు లింక్ పెట్టి దర్శకుడు బుచ్చిబాబు చాలా వరకు కథను బాగానే నడిపించారు. ఈ మూవీ నిడివి తగ్గించి ఉంటే ఫలితం మరింత మెరుగ్గా ఉండేది అనే అభిప్రాయం కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఓవర్సీస్ లో కూడా పెద్ది కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. ఆదివారం వరకు ఈ మూవీ జోష్ కొనసాగే అవకాశం ఉంది అని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోమవారం నుంచి అంటే జూన్ 8 నుంచి బుకింగ్స్ ఎలా ఉంటాయి అన్నదే ఇప్పుడు కీలకం కానుంది. గత సినిమా గేమ్ ఛేంజర్ తో పోలిస్తే పెద్ది మూవీ తో హీరో రామ్ చరణ్ ట్రాక్ లోకి వచ్చినట్లే అని చెప్పొచ్చు.



