Telugu Gateway
Cinema

చిరంజీవి ప్రకటనే పవన్ కు కీలకం!

చిరంజీవి ప్రకటనే పవన్ కు కీలకం!
X

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టాలీవుడ్ ఎటు వైపు?. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోరినట్లు టాలీవుడ్ హీరో లు వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జన సేన, బీజేపీ కూటమి కి మద్దతు గా నిలబడతారా?. ఇది జరిగే పనేనా?. ఏప్రిల్ 18 న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ రాబోతుంది. మే 13 న ఎన్నికలు జరగనున్నాయి. అత్యంత కీలక ఎన్నికలకు ఇంకా నిండా నెల రోజుల సమయం కూడా లేదు. ఈ తరుణంలో టాలీవుడ్ కు చెందిన టాప్ హీరో లు దైర్యం చేసి బయటకు వచ్చి ఏ పార్టీ కి అయినా అండగా నిలబడతారా...లేక ఎప్పటి లాగానే మౌనాన్ని ఆశ్రయిస్తారా అన్నది కీలకం కానుంది. ఎందుకంటే కొద్ది నెలల క్రితం జన సేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి పేరుతో ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించిన సమయంలో రాష్ట్ర భవిష్యత్ కోసం..రాజకీయాలను, అభిమానాలను పక్కన బెట్టి..ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్ కోసం తమకు మద్దతు ఇవ్వాలని బహిరంగంగా కోరారు. ఏ హీరో ను అభిమానించే వారు అయినా రాష్ట్రం కోసం అండగా నిలబడాలంటూ పిలుపునిచ్చారు.

గతం లో ఎన్నడూ లేని రీతిలో పవన్ కళ్యాణ్ ఈ విషయంలో అటు చిరంజీవి, ప్రభాస్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, రవి తేజ ఇలా అందరి పేర్లు బహిరంగ సభల్లోనే ప్రస్తావించి వాళ్ళ మద్దతు కోరారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కారు వచ్చిన తర్వాత సినిమా టికెట్స్ విషయంలో టాలీవుడ్ కు, వైసీపీ ప్రభుత్వం మధ్య వివాదం తలెత్తింది. ఇది అప్పటిలో పెద్ద దుమారమే రేపిన విషయం తెలిసిందే. కొంత మంది హీరో లు వైసీపీ కి వ్యతిరేకంగా మాట్లాడితే సోషల్ మీడియాలో వాళ్ళను, వాళ్ళ సినిమాలను కూడా పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు. ఎన్నికలకు చాలా రోజుల ముందు బహిరంగంగా టాలీవుడ్ ను సపోర్ట్ చేయమని కోరిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా మరో సారి అలాంటి అప్పీలు చేస్తారా..లేక తన ప్రచారం తాను చేసుకుంటూ పోతారా అన్నది కూడా కీలకం కానుంది. ఇప్పటి వరకు చిరంజీవి బయటకు వచ్చి తన సోదరుడి పార్టీ కి బహిరంగంగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించ లేదు. కొద్ది రోజుల క్రితం జన సేన కు ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇవ్వటంతో పాటు తమ్ముడిని ఆశీర్వదించారు.

తాజాగా బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సి ఎం రమేష్ కు కూడా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజలకు మంచి చేసే వాళ్లకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుంది అని సీఎం రమేష్ తో చిరంజీవి వ్యాఖ్యానించారు. జన సేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంత అన్న చిరంజీవి బహిరంగంగా జన సేన, టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించకపోతే ఇతర హీరోల మద్దతు కోరే విషయం లో పవన్ ఇరకాటంలో పడే అవకాశం ఉంది. సొంత అన్న మద్దతు ప్రకటించకుండా ఇతర హీరో లను కోరటం ఆయనకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది అనే చెపుతున్నారు. టాలీవుడ్ లోని ఇతర హీరో ల సంగతి పక్క పెడితే మెగా ఫ్యామిలీ లో ఉన్న హీరో లు అయిన రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లు బయటపడి కూటమికి మద్దతు ఇస్తారా లేదా అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ కు మద్దతు విషయంలో చిరంజీవి గతంలో పలు మార్లు మాటలు మార్చారు. పవన్ కళ్యాణ్ బలంగా టాలీవుడ్ సపోర్ట్ కోరాలంటే కూడా చిరంజీవి నిర్ణయం అత్యంత కీలకం అని చెప్పక తప్పదు.

Next Story
Share it