Telugu Gateway
Cinema

క్రిష్ మ్యాజిక్ వర్క్ అవుట్ అయిందా?!)Ghaati Movie Review)

క్రిష్ మ్యాజిక్ వర్క్ అవుట్ అయిందా?!)Ghaati Movie Review)
X

రెండేళ్ల తర్వాత అనుష్క శెట్టి నటించిన కొత్త సినిమా ఘాటి శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ దర్శకుడు క్రిష్ కావటం...ఇందులో అనుష్క లీడ్ రోల్ పోషించటంతో దీనిపై అంచనాలు పెరిగాయి అనే చెప్పాలి. అటు దర్శకుడు క్రిష్ తో పాటు అనుష్క కు కూడా మంచి హిట్ లేక చాలా కాలమే అయింది. దీంతో వీళ్ళిద్దరూ ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ సినిమా కథ అంతా కూడా గంజాయి చుట్టూనే తిరుగుతుంది అనే విషయాన్ని ట్రైలర్ లోనే స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా సరిహద్దుల్లో ఉండే తూర్పు కనుమల్లో సినిమా స్టోరీ అంతా సాగుతుంది. ఇక్కడ ఉండే వాళ్ళు అంతా కూడా గంజాయి సాగు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. తర్వాత దీనికి స్వస్తి పలకాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు...ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత వీళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి అన్నదే ఘాటి సినిమా. ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించిన అనుష్క తో పాటు విక్రమ్ ప్రభు లు కూడా ఘాటి లుగా పని చేస్తారు.

అంటే కొండల్లో నుంచి గంజాయిని ఇతర దేశాలకు సరఫరా చేసే వాళ్ళ కోసం కోసుకొచ్చి ఇస్తుంటారు. కానీ వీళ్ళిద్దరూ గంజాయి ని లిక్విడ్ గా చేసి విక్రయిస్తూ కోట్లు గడిస్తారు. ఇది ఆ ప్రాంతంపై పట్టున్న మాఫియా గ్యాంగ్ కు తెలిసిన తర్వాత ఎదురయ్యే సవాళ్లతో సినిమా కథ కొత్త మలుపు తీసుకుంటుంది. ఈ సినిమాలో అనుష్క తర్వాత తన నటన ద్వారా ఆకట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది కందుల నాయుడుగా కనిపించిన చైతన్య రావు అనే చెప్పాలి. ఈ పాత్రతో దర్శకుడు క్రిష్ ఆయనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించారు. షీలావతిగా కనిపించిన అనుష్క కు ఈ సినిమాలో అక్కడక్కడా వావ్ అనిపించే సీన్లు పడ్డాయి కానీ...సినిమా అంతా ఆ ప్రభావం కనిపించదు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లోనే అనుష్క కు హీరో రేంజ్ సీన్లు పడ్డాయి అనే చెప్పాలి. వీటికి విద్యాసాగర్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా పని చేసింది.

ఈ సినిమాలో ముఖ్యంగా తూర్పు కనుమల అందాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వీటిని తెరకెక్కించిన విధానం కూడా బాగుంది. సినిమా ప్రారంభంలో అనుష్క బస్ కండక్టర్ గా కనిపించిన సన్నివేశాలు ఏ మాత్రం ఆకట్టుకునేలా లేవు. అదే సమయంలో ఇది చూసిన వాళ్లకు అనుష్క లో పాత గ్లో పోయింది అనే ఫీల్ వస్తుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఘాటి సినిమాలో జగపతి బాబు, జిషు సేన్ గుప్తా, జాన్ విజయ్, రవీంద్ర విజయ్ లు ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. అయితే దర్శకుడు జాగర్లమూడి క్రిష్ గత సినిమాలతో పోలిస్తే ఇందులో బావోద్వేగాగాలు ఎక్కడా కనిపించవు. దీంతో ఇది రొటీన్ స్టోరీ తో కూడిన రొటీన్ మూవీ గానే నిలిచిపోతుంది.

రేటింగ్:2 .5 /5

Next Story
Share it