సరదా సరదాగా 'అంటే సుందరానికి' టీజర్
హీరో నాని మరో కొత్త సినిమా విడుదలకు రెడీ అవుతోంది. చిత్ర యూనిట్ టీజర్ విడుదల చేసి..సినిమా విడుదల తేదీని కూడా చెప్పేసింది. 'అంటే సుందరానికి' సినిమాలో నాని పాత్ర ఆకట్టుకునేలా ఉంది. ఆద్యంతం సరదా సరదాగా సాగిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచిందనే చెప్పాలి. ఈ సినిమాలో నానికి జోడీగా నజ్రియా ఫహద్ నటిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సుందర్ ప్రసాద్ మీ అబ్బాయే కదండీ అన్న డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది.
గండాలు ఉన్నాయంటూ హీరోతో పూజల మీద పూజలు చేయించడమే కాక ఏకంగా నాలుకకు వాత పెట్టే సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. హీరో సుందర్.. క్రైస్తవ అమ్మాయి లీలాను ప్రేమించడంతో ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదాలు ఉన్నట్లు టీజర్ లో చూపించారు. మత ఆచారాలకు కట్టుబడి ఉండే ఇరు కుటుంబాలను ఒప్పించడానికి హీరో, హీరోయిన్లు పడ్డ కష్టాలేమిటో ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ మూవీ జూన్ 10న థియేటర్లలోవిడుదల కానుంది.