Telugu Gateway
Cinema

ఇది సినిమా పిచ్చోళ్ళ సినిమా !

ఇది సినిమా పిచ్చోళ్ళ సినిమా !
X

రాజకీయాల్లో పాపులర్ అయిన ఒక డైలాగు ను సినిమా టైటిల్ గా పెట్టడంతోనే అందరి దృష్టి ఈ మూవీ పై పడింది . పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ తొలిసారి విజయం సాధించిన తర్వాత ఆయన ఫ్యాన్స్ బైకులతో పాటు కార్లపై కూడా పెద్ద ఎత్తున పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ రాయించుకున్నారు. అప్పటిలో అది పెద్ద సెన్సేషన్ గా మారింది. సోషల్ మీడియా లో కొద్ది రోజులు హల్చల్ చేసింది కూడా. హీరో రామ్ కొత్త సినిమా కు ఆంధ్రా కింగ్ తాలూకా అని పెట్టడంతో ఈ సినిమాపై కూడా ఆసక్తి పెరిగింది. ఇది కొంత మూవీ కి కలిసి వచ్చింది అని కూడా చెప్పొచ్చు. రామ్ పోతినేని గత కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న హీరో. దర్శకుడు పి.మహేష్ బాబు తెరకెక్కించిన మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి మూవీ కూడా ఒక మోస్తరుగానే సక్సెస్ అయింది.

వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రామ్ కు జోడిగా భాగ్య శ్రీ బొర్సే నటించింది. బయో పిక్ అఫ్ ఫ్యాన్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. చెప్పినట్లే ఈ మూవీ అంతా సినిమాల చుట్టూనే తిరుగుతుంది. టాలీవుడ్ లో ఫ్యాన్ వార్స్ ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. అది కూడా గోదావరి జిల్లాల్లో ఒక 25 సంవత్సరాల క్రితం పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు ఇందులో. తన అభిమాన హీరో చేస్తున్న వందవ సినిమా ఆర్థిక సమస్యలతో ఆగిపోతుంది అని తెలిసి అభిమాని ఏకంగా ఆ హీరో కోసం మూడు కోట్ల రూపాయలు ఎలా ఆ హీరో అకౌంట్ లో వేశాడు. విషయం తెలుసుకున్న హీరో తనకు ఏ మాత్రం తెలియని అభిమాని తన కోసం ఇంత భారీ మొత్తం డబ్బులు వేయటం తో షాక్ కు గురి అయి అతన్ని కలవటానికి బయలుదేరతాడు. అభిమాని తన ప్రేమను కూడా తాను ఎంతగానే ప్రేమించే హీరో కోసం త్యాగం చేయటం వంటి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు.

ఈ సినిమాలో అభిమాన హీరో సూర్య గా ఉపేంద్ర నటిస్తే...అభిమాని సాగర్ గా రామ్ పోతినేని తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. హీరో రామ్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కాంబినేషన్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకు హై లైట్ అంటే క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్స్ అనే చెప్పాలి. ఇవి ప్రేక్షకుల కంట తడి పెట్టిస్తాయి. ఇందులో ఉపేంద్ర పాత్ర పరిమితగానే ఉన్నా కూడా ఉన్నంతసేపు మంచి ఇంప్యాక్ట్ చూపిస్తుంది. ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. రావు రమేష్, మురళి శర్మల వి కూడా ఇందులో ఎంతో కీలకమైన పాత్రలు అనే చెప్పాలి. సినిమా పిచ్చి ఉన్న వాళ్లకు మాత్రమే నచ్చే సినిమా ఇది అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా అంతా కూడా ఇదే ఉంటుంది కాబట్టి. ప్రేక్షకులకు సినిమా నిడివి ఎక్కువైనా ఫీలింగ్ తో పాటు చాలా సార్లు మూవీ స్లో గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో హైలైట్ అంటే కీలక తారాగణం యాక్షన్ తో పాటు భావోద్వేగాలు. ఎన్నో విషయాల్లో తన హీరో నుంచి అభిమాని స్ఫూర్తి పొంది ..జీవితంలో అడుగులు ముందుకు వేస్తే..చివరకు హీరో కూడా అభిమాని నుంచి స్ఫూర్తి పొంది ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తిరిగి జీవితాన్ని మొదలుపెట్టొచ్చు అనే ధీమాతో సినిమాను ముగిస్తాడు.

రేటింగ్ : 2 .75 /5

Next Story
Share it