Telugu Gateway
Cinema

పుష్ప 2 సినిమాకి ఉత్తమ నటుడి అవార్డు

పుష్ప 2 సినిమాకి ఉత్తమ నటుడి అవార్డు
X

తెలంగాణ లో ప్రభుత్వం తరపున పద్నాలుగు సంవత్సరాల తర్వాత సినిమా అవార్డు లు ఇవ్వబోతున్నారు. బిఆర్ఎస్ పదేళ్ల కాలంలో అసలు ఈ అవార్డు ఊసు ఎత్తలేదు. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ సినిమా అవార్డ్ లకు బ్రేక్ పడింది. గతంలో నంది అవార్డు ల పేరిట ప్రతి ఏటా సినిమా అవార్డులు ఇచ్చే వాళ్ళు అనే విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సినిమా అవార్డు లను గద్దర్ అవార్డు ల పేరుతో ఇవ్వాలని నిర్ణయించటం...దీని కోసం కమిటీ ని కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గురువారం నాడు గద్దర్ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ చైర్ పర్సన్ జయసుధ అవార్డు గ్రహితీల జాబితా ప్రకటించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్స్ వస్తే వీటిని పరిశీలించి నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. అయితే ఈ అవార్డు ల జాబితాలో అందరిని ఆకర్షించిన అవార్డ్ ఒకటే ఒకటి అని చెప్పొచ్చు. అదే పుష్ప 2 హీరో అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడు అవార్డు ప్రకటించారు.

గతంలో అల్లు అర్జున్ కు పుష్ప సినిమా కే జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. టాలీవుడ్ లో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న తోలి హీరో గా కూడా అల్లు అర్జున్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా చోటుచేసుకున్న సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ చనిపోవటం, ఈ ఘటనలోనే బాలుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఇంకా కోలుకోలేని స్థితిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసు లో తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయగా ..ఆయన ఒక్క రాత్రి చంచలగూడ జైలు లో ఉండి వెంటనే బెయిల్ పై బయటకు వచ్చారు. ఆ సమయంలోనే అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ నేరుగా ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు కానీ.. ఆయన వ్యవహరించిన తీరు అప్పటిలో పెద్ద దుమారం రేపింది. ఒక దశలో టాలీవుడ్ వర్సస్ తెలంగాణ సర్కారు అన్నట్లు పరిస్థితి మారింది. తర్వాత ఎప్పటి లాగానే ఈ విషయం పక్కకు పోయింది. ప్రభుత్వం కూడా దీన్ని వదిలేసింది.

అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమాకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఉత్తమ నటుడి అవార్డ్ ప్రకటించటంతో తనను అరెస్ట్ చేసిన రేవంత్ రెడ్డి సర్కారుపై ఆగ్రహంగా ఉన్న అల్లు అర్జున్ జూన్ 14 న జరిగే కార్యక్రమానికి వచ్చి ఈ అవార్డు తీసుకుంటారా..లేదా అన్నది అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. పుష్ప సినిమాల హిట్ తర్వాత అల్లు అర్జున్ తీరు పూర్తిగా మారిపోయింది అనే అభిప్రాయం టాలీవుడ్ వర్గాల్లో ఉంది. అల్లు అర్జున్ టెంపర్ మెంట్ ప్రకారం ఆయన ఈ అవార్డు తీసుకోవటానికి రావటం అనుమానమే అని టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి. చూడాలి ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో. 2024 సంవత్సరానికి గాను ఉత్తమ మొదటి చిత్రం కల్కి గా కాళీ, ఉత్తమ రెండోవ చిత్రం పోట్టేల్, ఉత్తమ మూడవ చిత్రం లక్కీ భాస్కర్ ను ఎంపిక చేశారు. టాలీవుడ్ వర్గాలు చెపుతున్నట్లు అల్లు అర్జున్ ఈ అవార్డు తీసుకోవటానికి రాకపోతే అప్పుడు అది కూడా పెద్ద సంచలనంగా మారటం ఖాయం. అయితే ముందే ఖరారు అయిన కార్యక్రమం కోసం ...లేదంటే షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్నారు అని చెప్పే ఛాన్స్ సినీ సెలబ్రిటీలకు ఎప్పుడు ఉండనే ఉంటుంది.

Next Story
Share it