Telugu Gateway
Cinema

అతి పెద్ద విడుదలతో చరిత్ర

అతి పెద్ద విడుదలతో చరిత్ర
X

పుష్ప 2 సినిమా విడుదలకు ముందే రికార్డు లు నమోదు చేస్తోంది. డిసెంబర్ 5 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా విడుదల కాని రీతిలో ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 11500 స్క్రీన్స్ లో విడుదల చేయబోతున్నారు. ఇందులో ఒక్క భారత్ దేశంలో 6500 స్క్రీన్స్ ఉంటే...విదేశాల్లో కూడా ఏకంగా 5000 స్క్రీన్స్ లో ఈ సినిమాను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రికార్డు ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కు లేదు అని చెపుతున్నారు. దీంతో పుష్ప 2 రిలీజ్ విషయంలోనే ఒక రికార్డు నమోదు చేయటంతో పాటు...ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలోనూ ఇది కలిసి వచ్చే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ విషయంలోనే తమ హీరో రికార్డు నమోదు చేయబోతున్నట్లు వార్తలు రావటంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు అనే చెప్పాలి. పుష్ప 2 ది రూల్ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో అల్లు అర్జున్ కు జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది. వచ్చే నెలలో ప్రత్యేక గీతం షూటింగ్ పూర్తి చేస్తే పుష్ప 2 షూటింగ్ అయిపోయినట్లే లెక్క. ఈ ప్రత్యేక గీతంలో ఎవరు నటిస్తారు అనే విషయం బయటకు రాలేదు. ఇప్పటికే బాలీవుడ్ కు చెందిన పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అధికారిక ప్రకటన వస్తే కానీ ఈ సస్పెన్స్ వీడదు అనే చెప్పాలి. ఇది ఇలా ఉంటే ‘పుష్ప-2’ టీజర్ టాలీవుడ్ చరిత్రలో కొత్త రికార్డు నమోదు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది.

ఈ టీజర్ ఏకంగా 150 మిలియన్‌కి పైగా వ్యూస్ దక్కించుకుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన టీజర్లలో ఈ ఫీట్‌ను సాధించిన ఫస్ట్ ఎవర్ టీజర్‌గా ‘పుష్ప-2’ రికార్డును సెట్ చేసింది. ఇది కూడా సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పకనే చెపుతున్నాయి అనే అభిప్రాయాన్ని టాలీవుడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. పుష్ప 2 కు ఓటిటి, సాటిలైట్ రైట్స్ విషయంలోనే ఏ సినిమాకు రాని రికార్డు ధర వచ్చినట్లు కూడా చెపుతున్నారు. మరి సినిమా విడుదల తర్వాత పుష్ప 2 ఎన్ని సంచలనాలు సాదిస్తోందో చూడాలి.

Next Story
Share it