Telugu Gateway
Cinema

బాలకృష్ణ, బోయపాటి మ్యాజిక్ రిపీట్ అయిందా?!

బాలకృష్ణ, బోయపాటి మ్యాజిక్ రిపీట్ అయిందా?!
X

ఒకటి కాదు...రెండు కాదు ఈ కాంబినేషన్ లో ఇప్పటి కే మూడు సినిమాలు వచ్చాయి. ఆ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వచ్చింది నాల్గవ సినిమా. అలాంటి సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమా లు బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి కలయికలో ఇప్పుడు అఖండ 2 తాండవం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవానికి ఈ సినిమా తొలుత సెప్టెంబర్ 25 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రకరకాల కారణాలతో ఈ మూవీ ని డిసెంబర్ 5 కి వాయిదా వేశారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో డిసెంబర్ ఐదున విడుదల కావాల్సిన ఈ మూవీకి బ్రేకులు పడిన సంగతి తెలిసిందే. అన్ని అడ్డంకులను అధిగమించి ఈ సినిమా డిసెంబర్ 11 రాత్రి ప్రీమియర్స్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అఖండ 2 సినిమా కథ అంతా దేవుడు...నమ్మకాల చుట్టూనే తిరుగుతుంది. ఇండియా ను దెబ్బకొట్టాలంటే ఇందుకు ముందు చేయాల్సింది భారతీయులు బలంగా నమ్మే దేవుడిపై నమ్మకాన్ని దెబ్బకొట్టాలని చూస్తారు. ఇందుకు దేశంలోని కొంత మంది స్వార్ధ రాజకీయ నాయకులు శత్రు దేశాలతో చేతులు కలుపుతారు. అందరూ కలిసి రకరకాల ప్లాన్స్ వేస్తారు. మాస్టర్ ప్లాన్ కింద మహా కుంభమేళాను టార్గెట్ చేసుకుని తమ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని చూస్తారు. శత్రుదేశాలతో కలిసి దేశంలోని రాజకీయ నాయకులు చేసిన ప్లాన్ ను అడ్డుకోవనాటికి అఖండ చేసిన పోరాటమే అఖండ 2 తాండవం సినిమా. అఖండ పార్ట్ వన్ లాగానే ఇందులో కూడా బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా అంతా ఎక్కువ శాతం శివుడు పూనిన అఖండ పాత్రధారి చుట్టూనే తిరుగుతుంది. ఇందులో అసలు సిసలు అఖండ తాండవం సెకండ్ హాఫ్ లో మొదలవుతుంది. అఖండ 2 తాండవం సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది బాలకృష్ణ వన్ మ్యాన్ షో. హీరోయిన్ సంయుక్త మీనన్ కు ఒక్క పాట మినహా ఆమెకు ఇందులో పెద్దగా ప్రభావం చూపించే పాత్ర దక్కలేదు.

ఈ సినిమాలో భారీ తారాగణమే ఉన్నా కథ అంతా కూడా బాలకృష్ణ, కబీర్ దుహన్ సింగ్, సర్వదమన్ బెనర్జీ, స్వస్థ ఛటర్జీ , అది పినిశెట్టిల మద్యే తిరుగుతుంది. అది పినిశెట్టి నేత్ర పాత్రలో సెకండ్ హాఫ్ లోనే కనిపించినా ఉన్నంత సేపు ఈ పాత్ర సినిమా పై మంచి ప్రభావం చూపిస్తుంది అనే చెప్పాలి. అఖండ 2 సినిమా కు ప్రధాన బలం అఘోర పాత్రలో బాలకృష్ణ నటనతో పాటు పవర్ ఫుల్ సంభాషణలు. అక్కడక్కడ ఈ సినిమాలో పొలిటికల్ టచ్ ఇచ్చి...ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను టచ్ చేసే ప్రయత్నం చేశారు. సినిమా అంతా కూడా ఎక్కువ భాగం హైందవ ధర్మం, సనాతన ధర్మం చుట్టూనే తిరుగుతుంది. లొకేషన్స్ తో పాటు టేకింగ్ లో ఎక్కడా రాజీపడలేదు అనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ 2 మూవీ లో పవర్ హెచ్చుతగ్గుల లాగా ఒక్కో సారి హై కి తీసుకెళ్లి మళ్ళీ ఒక్కోసారి కింద పడేసిన ఫీలింగ్ కలుగుతుంది.

సెకండ్ హాఫ్ మొత్తం పీక్ లోనే సాగుతుంది. తల్లి సెంటిమెంట్, పదునైన సంభాషణలు ..బాలకృష్ణ తాండవమే సినిమాకు ప్రధాన బలాలు. బాలకృష్ణ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇదే కావటంతో ఈ సినిమా మొత్తాన్ని సనాతన ధర్మం...హిందూ ధర్మం చుట్టూనే తిప్పినట్లు కనిపిస్తుంది. మరి హిందీ మార్కెట్ లో బాలకృష్ణ కు అఖండ 2 తో ఎలాంటి ఎంట్రీ దొరుకుతుందో చూడాలి. అయితే అఖండ విజయంలో బాలకృష్ణ నటనకు తోడు...థమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎంత కీలక పాత్ర పోషిందో అందరికి తెలుసు. అయితే అఖండ 2 విషయానికి వస్తే థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే ఉన్నా...ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఇందులో జోష్ తగ్గిన ఫీలింగ్ వస్తుంది.

రేటింగ్ :2 .75 -5

Next Story
Share it