వరసగా ఐదవ సినిమా

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ 2 తాండవం సినిమా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను అధిగమించింది. బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ విడుదలకు ముందు పలు అవాంతరాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలలో చోటుచేసుకున్న జాప్యం ఫలితంపై ప్రభావం చూపించింది అనే అభిప్రాయం బాలకృష్ణ అభిమానుల్లో ఉంది. అఖండ కు ఇది సీక్వెల్ కావటంతో ఈ సినిమా అంతకు మించి ఉంటుంది అని ఎక్కువ మంది అంచనాలు పెట్టుకున్నారు. వీటిని అందుకోవడంలో ఇది విఫలం అయింది అనే చెప్పాలి. మరో వైపు ఇది బాలకృష్ణ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. ఇందులోని కంటెంట్ ఆధారంగా హిందీ మార్కెట్ లో మంచి వసూళ్లు రాబడుతుంది అనే అంచనాలు వేసుకున్నా కూడా ఈ లెక్కలు పూర్తిగా తప్పాయి.
దీంతో ఎక్కువ వసూళ్లు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ కలెక్షన్స్ కే పరిమితం కావాల్సి వచ్చింది. అఖండ 2 తో కలుపుకుంటే బాలకృష్ణ సినిమాలు వరసగా ఐదు వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను అధిగమించినట్లు అయింది అని చెప్పొచ్చు. ఈ జాబితాలో అఖండ, వీరసింహ రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 ఉన్నాయి. అఖండ 2 సినిమాకు మిశ్రమ స్పందనలు వచ్చినా కూడా ఈ సినిమా వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించటం విశేషం. అయితే బయ్యర్లు లాభాల్లోకి రావాలంటే ఈ వసూళ్లు ఏ మాత్రం సరిపోవు అని ..ఇప్పటి వరకు కేవలం దగ్గర దగ్గర 60 శాతం వరకు మాత్రమే జరిగినట్లు టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి.నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ ఫస్ట్ డే వసూళ్లు చెప్పింది తప్ప ..ఇప్పుడు వంద కోట్ల మైల్ స్టోన్ గురించి కూడా అధికారికంగా ప్రకటించలేదు.



