Telugu Gateway
Cinema

అల్లు అర్జున్ ను మార్చేసిన ‘పుష్ప’

అల్లు అర్జున్ ను  మార్చేసిన ‘పుష్ప’
X

తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. బడ్జెట్ విషయంలోనే కాకుండా...కలెక్షన్స్ విషయంలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ సినిమాలు దుమ్మురేపుతున్నాయి. ఇది ఎంతలా అంటే బాలీవుడ్ పరిశ్రమ అంతా కూడా తెలుగు సినిమా లు...తెలుగు సినిమా వసూళ్లు చూసి కుళ్ళుకునేంతగా పరిశ్రమ ఎదిగింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావటం ఒక సంచలనం అయితే..పుష్ప హీరో అల్లు అర్జున్ కు ఇప్పుడు జాతీయ అవార్డు దక్కింది. గత 69 సంవత్సరాల్లో జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరో ఒక్క అల్లు అర్జున్ కావటం విశేషం. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయిన విషయం తెలిసిందే. తెలుగుతో పాటు దేశ వ్యాప్తంగా పుష్ప సినిమా సంచలన విజయాన్ని దక్కించుకుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. గురువారం నాడు ఢిల్లీ లో 69 వ జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రకటించారు. పుష్ప సినిమా కు అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రాగా,పుష్ప సినిమాలో పాటలకు సంబంధించి ఉత్తమ సంగీతం విభాగంలో దేవిశ్రీ ప్రసాద్ కు కూడా అవార్డు దక్కింది. 2021 సంవత్సరానికి గాను ఉత్తమ తెలుగు సినిమాగా ఉప్పెన ఎంపిక అయింది. ఇక్కడ విశేషం ఏమిటి అంటే అటు పుష్ప తో పాటు ఇటు ఉప్పెన సినిమాను నిర్మించింది కూడా మైత్రి మూవీ మేకర్స్ కావటం విశేషం.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా పలు విభాగాల్లో జాతీయ అవార్డులను దక్కించుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమా కు సంబంధించి ఉత్తమ కోరియోగ్రాఫర్ అవార్డు ప్రేమ్ రక్షిత్ కు, ఇదే సినిమాలో కొమరం భీముడొ పాట పాడిన కాల భైరవకు ఉత్తమ నేపధ్య గాయకుడు, ఆర్ఆర్ఆర్ సినిమాకు ఉత్తమ నేపద్య సంగీతం అవార్డు కీరవాణికి దక్కింది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా కూడా ఆర్ఆర్ఆర్ అవార్డు పొందింది. జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు పెద్ద ఎత్తున అవార్డులు దక్కించుకుని తమ సత్తా చాటాయి. ఉత్తమ హిందీ చిత్రంగా రాకెట్రి ది నంబి అవార్డు దక్కించుకుంటే, జాతీయ ఉత్తమనటి అవార్డు ను అలియా భట్ (గంగూభాయ్ కటివాడి), మిమి సినిమాలో చేసిన కృతి సనన్ లు సంయుక్తంగా అవార్డు దక్కించుకున్నారు.

Next Story
Share it