Telugu Gateway
Andhra Pradesh

ఎమ్మెల్యే రోజా కంట కన్నీరు!

ఎమ్మెల్యే రోజా కంట కన్నీరు!
X

ఆర్ కె రోజా. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీలో కీలక నేత. ఆమె పార్టీ వాయిస్ గా నిలిచారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆమెకు మంత్రి పదవి ఖాయం అని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఆమెకు ఛాన్స్ దక్కలేదు. రోజా అసంతృప్తికి గురైనట్లు వార్తలు రావటంతో అధిష్టానం ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి ఇచ్చి ఆమెను సంతృప్తిపర్చే ప్రయత్నం చేసింది. అయితే చిత్తూరు జిల్లాలో మాత్రం ఆమెకు పలుమార్లు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఆమె సమస్యలను పట్టించుకునేవారు కరువయ్యారు. తాజాగా ఆమె తనకు ఎదురవుతున్న సమస్యలపై శాసనసభ ప్రివిలైజ్ కమిటీ ముందు విలపించినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రొటోకాల్ ప్రకారం తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆమె వాపోయారు. టీటీడీలో కూడా ఇదే పరిస్థితి ఉందని ఫిర్యాదు చేశారు. ఎన్ని కమిటీలు వచ్చినా, ఎంత మందికి చెప్పుకున్నా.. పట్టించుకోవడం లేదంటూ వాపోయారు.

ఆమె ప్రివిలైజ్ కమిటీ ముందుకు వెళ్లడానికి అసలు కారణం.. ప్రొటోకాల్ ప్రకారం అధికార కార్యక్రమాలకు పిలవకపోవడం. సొంత నియోజకవర్గంలో ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరిగినా... రోజాకు సమాచారం అందించలేదు. దీంతో ఆమె నొచ్చుకుని.. ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో భాగంగా తిరుపతిలో ఇవాళ విచారణకు హాజరయ్యారు. గతంలో ఇలా పలుసార్లు జరిగిందని కమిటీ ముందు తన ఆవేదన వెలిబుచ్చారు. సొంత పార్టీ అధికారంలో ఉండగా... తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని.. సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అధికారులపై ఫిర్యాదు చేశారు. శాసనసభ సభ్యురాలిగా ప్రొటోకాల్ ప్రకారం అన్నీ సవ్యంగా జరిగేలా చూడాలని కమిటీని కోరారు. జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి అధికారులు అందరూ తమను విస్మరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story
Share it