ఆస్తుల పంపకం జరగలేదు

వైఎస్ ఫ్యామిలీలో ఆస్తుల వివాదం ఇప్పటిలో తేలేలా లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆస్తుల విషయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, వై ఎస్ షర్మిల మధ్య తీవ్ర స్థాయిలో విబేధాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే ఈ వివాదంలో దివంగత రాజశేఖర్ రెడ్డి భార్య వై ఎస్ విజయమ్మ తన కొడుకు జగన్ వైపు కాకుండా షర్మిల వైపు ఉండటమే అని చెప్పొచ్చు. రెండు రోజుల క్రితం షర్మిల మీడియా తో మాట్లాడుతూ అన్న అనే పదానికి వైఎస్ జగన్ కళంకం తీసుకొచ్చారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసలు ఇలాంటి అన్న ఉంటే శత్రువులు అవసరం లేదని అన్నారు. వివేకా హత్య ముమ్మాటికీ కడప ఎంపీ టికెట్ విషయంలోనే జరిగిందని పేర్కొన్నారు. ఎంపీ పదవికి అవానాష్ సరికాదని వివేకా స్వయంగా తనతో చెప్పారని షర్మిల వెల్లడించారు. జగన్‌కు వివేకా ఎంత చెప్పినా కడప ఎంపీ టికెట్ అవినాష్‌రెడ్డికే ఇచ్చారని ఆరోపించారు. వివేకా హత్య కేసు లో సునీత కు సిబిఐ తో పాటు కేంద్రంలోని బీజేపీ కూడా అన్యాయం చేస్తోంది అని ఆరోపించారు.
ఈ తరుణంలో తాజాగా ఆస్తుల కు సంబంధించిన అంశంపై వైఎస్ విజయమ్మ అడ్వకేట్ నోటరీ విడుదల చేశారు. ఇందులో ఆమె పలు విషయాలను ప్రస్తావించారు. 2009 లో వైఎస్ఆర్ మరణం వరకున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేననన్నారు. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. అన్ని ఆస్తులను నలుగురు మనుమళ్లకు, మనమరాళ్ళకు సమానంగా పంచాలనేదే వైఎస్ఆర్ ఉద్దేశమని, ఇది ఆయన ఆదేశం కూడా అని స్పష్టం చేశారు. తమ దగ్గరి వాళ్లందరికీ తెలిసిన వాస్తవం ఇదే అని విజయలక్ష్మి అన్నారు. ఎంఓయూలో వైఎస్.షర్మిలకు రాసిన ప్రతీ ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవేనని తెలిపారు. అందుకే జగన్‌మోహన్ రెడ్డి మళ్లీ ఎంఓయూ రాశారని ప్రస్తావించారు. నిజానికి తనకు తక్కువే రాశారని, సరస్వతి సిమెంట్‌తో సహా ఎంఓయూలో లేని యెలహంక ల్యాండ్ కూడా షర్మిలదేనని పేర్కొన్నారు.
జగన్ ఇచ్చానని చెబుతున్న నగదు షర్మిల వాటాకు ఇచ్చిన డెవిడెండ్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం చేశారని అన్నారు. నిజం ఏమిటో తన దేవుడికి..నా కొడుకుకు కూడా తెలుసు. గోబెల్స్ ప్రచారం చేయటానికి మీరు ఎవరు?. మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే..న్యాయం. అసత్యాల ప్రచారం మానుకోవాలని వైస్సార్ భార్యగా చేతులు జోడించి వేడుకుంటున్నా. మళ్ళీ మళ్ళీ మీడియా లో ఈ విషయం ప్రస్తావించవద్దు. దేవుడి సాక్షిగా నేను ఇందులో రాసినవన్నీ వాస్తవాలే అని విజయమ్మ తన లేఖ లో వెల్లడించారు.



