Telugu Gateway
Andhra Pradesh

కాంగ్రెస్ తో కలిసి ముందుకు

కాంగ్రెస్ తో  కలిసి ముందుకు
X

తెలంగాణ కాంగ్రెస్ గెలుపులో తనకూ వాటా ఉంది అంటున్నారు వై ఎస్ షర్మిళ . గత ఎన్నికల్లో తమ పార్టీ వైస్సార్ టిపీ బరిలో లేకపోవటం వల్లే కాంగ్రెస్ 31 సీట్లలో గెలిచింది అని లెక్కలతో సహా మరీ చెప్పారు. ఈ సీట్ల లో కాంగ్రెస్ కేవలం పది వేల ఓట్ల తో గెలిచింది అని ..దీనికి కారణం తాము పోటీకి దూరంగా ఉండటమే అని తెలిపారు. కాంగ్రెస్ తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నందునే తాము తెలంగాణాలో బరిలోకి దిగలేదని..తమ పాత్రను కాంగ్రెస్ అధిష్టానం కూడా గుర్తించి కాంగ్రెస్ లోకి ఆహ్వానం పలికారు అని తెలిపారు. తాము బరిలో ఉంటే కాంగ్రెస్ ఇబ్బంది పడేది అని వ్యాఖ్యానించారు. తెలంగాణాలో కెసిఆర్ అరాచక పాలన అంతమొందించటానికి తన వంతు ప్రయత్నం తాను చేశానని అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దూకుడు, గతానికి బిన్నంగా ఎన్నికల సమయంలో సీనియర్లు అందరూ కలిసి ముందుకు సాగటం..తొమ్మిదిన్నర సంవత్సరాల కెసిఆర్ పాలనపై వ్యతిరేకత వంటి అంశాలు తెలంగాణ కాంగ్రెస్ కు కలిసి రాగా..ఇప్పుడు షర్మిళ ఏకంగా 31 సీట్ల గెలుపులో తన పాత్ర ఉంది అని క్లెయిమ్ చేసుకోవటం ఆసక్తికర పరిణామంగానే చెప్పుకోవాలి. తెలంగాణ కాంగ్రెస్ నేతలు దీనిపై స్పందిస్తారా..లేక చూసి చూడనట్లు వదిలేస్తారా అన్నది చూడాలి. వాస్తవానికి షర్మిళ తెలంగాణ కాంగ్రెస్ లో చేరటానికి మొగ్గు చూపారు.

కానీ సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం దీనికి ససేమిరా అంతంతో అధిష్టానం కూడా వెనక్కి తగ్గింది. సొంతంగా 119 సీట్ల లో పోటీ చేస్తానని ప్రకటించిన షర్మిళ తర్వాత అనూహ్యంగా పోటీ నుంచి వెనక్కి తగ్గి కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం నాడు ఇడుపులపాయలో మీడియా తో మాట్లాడుతూ షర్మిల ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో కలిసి ముందుకు సాగటానికి నిర్ణయించుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళుతున్నాను అని..రెండు రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని అన్నారు. జనవరి నాలుగున షర్మిల కాంగ్రెస్ లో చేరటానికి ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు చెపుతున్నారు.షర్మిల కాంగ్రెస్ లో చేరిక ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీ కి పెద్ద షాకింగ్ పరిణామంగానే చెప్పుకోవాలి. అధిష్టానం ఆమెను పీసిసి పదవి తీసుకోవాలని కోరుతుంటే...ఆమె మాత్రం ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ గా ఉండి..వచ్చే ఎన్నికల నాటికీ పీసిసి అధ్యక్ష పదవి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి.

Next Story
Share it