Telugu Gateway
Andhra Pradesh

పింక్ డైమండ్ కహాని మర్చిపోయిన జగన్

పింక్ డైమండ్ కహాని మర్చిపోయిన జగన్
X

ఐదేళ్ల జగన్ పాలనలో టీటీడీ నిర్వహణపై వచ్చినన్ని విమర్శలు గతంలో ఎప్పుడూ రాలేదు. లడ్డూ నాణ్యత దగ్గర నుంచి భక్తులకు సౌకర్యాల కల్పన విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది అప్పటి జగన్ సర్కారు. ఇప్పుడు ఏకంగా లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉంది అని తేలటం దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపుతోంది. ఈ విషయాన్ని ఒక పేరున్న టెస్టింగ్ సెంటర్ కూడా నిర్దారించటంతో సీరియస్ నెస్ పెరిగింది. అయితే ఈ వాదనను ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీతో పాటు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఖండిస్తూ ఇది పూర్తిగా డైవర్షన్‌ పాలిటిక్స్ అంటూ విమర్శలు చేశారు. అంతే కాదు..చివరకు దేవుడిని కూడా చంద్రబాబు తన రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నాడు అని జగన్ ఆరోపించారు. కానీ ఇదే జగన్, ఆయన పార్టీ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు ఫస్ట్ టర్మ్ సీఎం అయిన సమయంలో వెంకటేశ్వర స్వామికి చెందిన పింక్ డైమండ్ తో పాటు పలు నగలను తీసుకెళ్లి చంద్రబాబు ఇంట్లో పెట్టుకున్నారు అని తీవ్ర ఆరోపణలు చేశారు. వెంటనే చంద్రబాబు ఇంట్లో తనిఖీలు చేయాలి..లేకపోతే మాయం చేస్తారు అంటూ జగన్ కు ఎంతో సన్నిహితుడు , అప్పటిలో వైసీపీ లో రెండవ స్థానంలో ఉన్న రాజ్య సభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

వైసీపీ నేతలు అంతా ఈ ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల కాలంలో జగన్ కానీ...వైసీపీ సర్కారు కానీ ఈ విషయాన్ని ఏ మాత్రం నిరూపించలేకపోయింది దీంతో ఇది అంతా ఫేక్ అని తేలిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బయటపెట్టిన జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యితో కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ తో ముడిపడిన తిరుమల లడ్డూ తయారు చేశారు అనే విషయంలో సాధ్యమైనంత వేగంగా యాక్షన్ తీసుకోవాల్సి ఉంది. ఇందుకు బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ లో స్వయంగా ముఖ్యమంత్రులు..పార్టీ అధినేతలు చెప్పిన విషయాలను కూడా ఎవరూ నమ్మే పరిస్థితి లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఎంత పెద్ద స్థానాల్లో ఉన్న వ్యక్తులు చెప్పిన విషయాలను అయినా వెంటనే నమ్మే పరిస్థితులు లేవు అన్నది నిజం. దీనికి ప్రధాన కారణం ఆయా నేతలే. నాయకులే కాదు..ఏకంగా ప్రభుత్వాలు అధికారికంగా చెప్పే విషయాల్లో కూడా దారుణ అబద్దాలు ఉండటంతో వీటిని నిర్దారించుకోవటం కూడా పెద్ద సవాలుగా మారుతోంది.

చంద్రబాబు కు ఇదే పెద్ద సవాల్ !

తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మరో వైపు జగన్ గత ఐదేళ్ల పాలనా కాలంలో టీటీడీ ప్రతిష్ట దెబ్బతీశాడు అని ముఖ్యమంతి చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు అంతా ఆరోపిస్తున్నారు. కూటమి సర్కారు కొలువుతీరి వంద రోజులు అయినా కూడా ఇంతవరకు టీటీడీ చైర్మన్ తో పాటు బోర్డు ను నియమించలేదు. తాజా వివాదం నేపథ్యంలో చంద్రబాబు నియామకాల విషయంలో ఏ మాత్రం కాస్త తేడా పేర్లు సెలెక్ట్ చేసినా అది పెద్ద దుమారం రేపటం ఖాయం. ఇప్పటికే టీటీడీ చైర్మన్ పదవి కి సంబంధించి బయటకు వచ్చిన పేర్లు ఏ మాత్రం ఆమోదయోగ్యం అయినవి కావని..వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్ టీటీడీ స్థాయికి ఏ మాత్రం సరిపోవు అని టీడీపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. టీటీడీ కి ఉన్న ప్రాధాన్యత దృష్టా ఇప్పుడు అవే పేర్లతో నియామకాలు చేస్తే మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కోకతప్పదు అనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో సాగుతోంది.

టీడీపీ కి మీడియా పరంగా ఏదో సహకరించారు అనో..ఇతర కారణాలు చెప్పి విలువలు ఉన్న వాళ్లకు ఇవ్వాల్సిన టీటీడీ చైర్మన్ , బోర్డు పదవులు రాజకీయ కారణాలతో నింపితే మాత్రం జగన్ తరహాలోనే టీడీపీ సర్కారు కూడా విమర్శలు పాలు కావాల్సి వస్తుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి బోర్డు సభ్యుల నియామకం విషయంలో నిర్ణయాలు అన్ని గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ కోణంలోనే సాగుతున్న విషయం తెలిసిందే. బోర్డు సభ్యుల నియామకం కోసం ఏకంగా దేశంలోని కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు...పారిశ్రామిక వేత్తలు కూడా సిఫారసులు చేసిన సందర్భాలు ఎన్నో. మరి చంద్రబాబు ఇప్పుడు ఏ మోడల్ ఎంచుకుంటారు అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it