అవాక్కు అవుతున్న సినిమా పెద్దలు!

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పెద్ద ప్లానే వేశారు. పైకి కనపడుతున్నది ఒకటి...లోపల జరుగుతున్నది మరోకటి. ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు హరిహర వీర మల్లు సినిమా అన్నది పెద్ద ఇష్యూ అయి కూర్చుంది. ఈ సినిమా విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జనసేనకు చెందిన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ లు స్పందించిన తీరు చూసి రాజకీయ వర్గాలతో పాటు అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు. ఎన్నో సమస్యలను అధిగమించి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హర హర వీర మల్లు ఎట్టకేలకు విడుదల ముహూర్తం ఖరారు చేసుకుంది. ఈ సినిమా జూన్ 12 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అన్ని సినిమాల తరహాలోనే ఈ సినిమా కు కూడా రేట్లు పెంచుకోవాలి. అయితే ఈ సినిమా హీరో రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి...సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి జనసేన కు చెందిన కందుల దుర్గేష్. దీంతో ఎలా చూసినా ఈ వ్యవహారం సెన్సిటివ్ గా మారుతుంది. అందుకే థియేటర్ల విషయం ఒకటి తెర మీదకు రాగానే ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో ఒక ప్రకటన విడుదల అయింది. అందులో కీలక అంశం ఏమిటి అంటే ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారు. వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తారు అన్నది అత్యంత కీలకమైన పాయింట్.
అంటే ఈ లెక్కన హరిహర వీర మల్లు నిర్మాత ఏ ఎం రత్నం తమ సినిమాకు అయిన వ్యయం ..తదితర వివరాలతో కూడిన ఒక వినతి పత్రాన్ని ఈ వ్యవహారాలు చూసే పరిశ్రమ బాడీ కి ఇస్తారు. వాళ్ళు ప్రభుత్వం దగ్గరకు ఈ ప్రతిపాదనతో వెళతారు. అంటే ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ కానీ..పవన్ కళ్యాణ్ నిర్మాత కానీ టికెట్ రేట్ల పెంపు సినిమాలో కనిపించరు. అంటే హరి హర వీర మల్లు సినిమా టికెట్ రేట్ల పెంపునకు లైన్ క్లియర్ చేసుకోవటం కోసం పరిశ్రమ బాడీ నే ప్రభుత్వాన్ని సంప్రదిస్తుంది. ఏపీలో ఇటీవల ప్రభుత్వం నియమించిన కమిటినే ఈ సినిమా టికెట్ రేట్లు ఖరారు చేస్తుంది. ఈ కమిటీ లో వివిధ శాఖల అధికారులతో పాటు సినీ నిర్మాత వివేక్ కూచిబొట్ల కూడా ఉన్నారు. ఈయన పవన్ కళ్యాణ్ కు ఎంతో సన్నిహితుడిగా పేరున్న పీపుల్స్ మీడియా అధినేత టి జీ విశ్వప్రసాద్ వ్యాపార భాగస్వామిగా ఉన్నారు అని పరిశ్రమ వర్గాలు చెపుతున్నాయి. సో ఏపీలో హరహర వీర మల్లు టికెట్స్ రేట్లు ఖరారుకు పరిశ్రమ ప్రతినిధులే వెళతారు తప్ప నిర్మాత నేరుగా అడగాల్సిన పని లేకుండా చేశారు అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే హర హర వీర మల్లు సినిమాను నిర్మాత ఏ ఎం రత్నం దగ్గర నుంచి అతి తక్కువ రేట్ కు తీసుకునేందుకు వరసగా టాలీవుడ్ లో భారీ భారీ సినిమాలు చేస్తున్న ఒక నిర్మాణ సంస్థ తో పాటు మరో నోటి దూల నిర్మాత కూడా ప్రయత్నాలు చేశారు అని...ఇదే పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి కారణం అయినట్లు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
అయితే రాబోయే రోజుల్లో సినిమా థియేటర్ల లీజ్ విషయానికి బ్రేకులు వేసేలా పవన్ కళ్యాణ్ రంగంలో దిగినట్లు చెపుతున్నారు. ముఖ్యంగా గంపగుత్తగా థియేటర్లు కొంత మంది చేతిలో ఉండటం వల్ల సమస్యలు వస్తున్నాయి అని...ఇక అలా కాకుండా ఎవరైతే థియేటర్ల ఓనర్ లు ఉన్నారో వాళ్లే స్వయంగా వీటిని నడిపేలా ఉంటేనే టికెట్ రేట్ల పెంపు వంటి సౌకర్యాలు కలిపిస్తామని చెప్పబోతున్నట్లు సమాచారం. ఈ దిశగా తెర వెనక చర్చలు సాగుతున్నట్లు చెపుతున్నారు. ఈ పని అధికారికంగా ప్రభుత్వం చేయలేదు. కాబట్టి అనధికారికంగానే థియేటర్ల ను కొంత మంది తమ చేతుల్లో పెట్టుకునే వెసులుబాటు లేకుండా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు అని..రెండు రాష్ట్రాల్లో కూడా ఈ దిశగా త్వరలోనే చర్యలు ప్రారంభించే అవకాశం ఉంది అని టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ అనధికారికంగా కీలక పాత్ర పోషించనున్నట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఏది ఏమైనా ఇప్పుడు హర హర వీర మల్లు కు ఆంధ్ర ప్రదేశ్ లో ఏ రేంజ్ లో టికెట్ రేట్లు పెంచుతారో వేచిచూడాల్సిందే. తొలుత ఏపీలో టికెట్ రేట్లు పెంపు జీఓ వస్తుంది అని...తర్వాత తెలంగాణ లో కూడా ఇదే మోడల్ ఫాలో అయ్యే అవకాశం ఉంది అని చెపుతున్నారు.



