Telugu Gateway
Andhra Pradesh

అమరావతి ‘లెక్కల్లో’ తేడాలే కారణమా!

అమరావతి ‘లెక్కల్లో’ తేడాలే కారణమా!
X

ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా ఆయన కు మంత్రి పదవి గ్యారంటీ. మున్సిపల్ శాఖ కూడా ఏదో కాంట్రాక్టు ఇచ్చినట్లు ఆయనకే ఇస్తారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఫస్ట్ టర్మ్ లో అదే జరిగింది. ఇప్పుడు రెండవ సారి కూడా నారాయణకు అత్యంత కీలకమైన మున్సిపల్ శాఖనే అప్పగించారు. నారా లోకేష్ శాఖ అయినా మారింది కానీ...మంత్రి నారాయణ మున్సిపల్ శాఖ మారలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణల మధ్య సంబంధం, అనుబంధం వెనక అసలు కారణాలు ఏంటో టీడీపీ నేతలు అందరికి తెలుసు. కానీ ఈ మధ్య మాత్రం ఎక్కడో ‘లెక్కలు’ తేడా వచ్చాయనే చర్చ టీడీపీ వర్గాల్లో సాగుతోంది. ఈ లెక్కల తేడా తో పాటు అమరావతి విషయాన్నీ ఆయన హేండిల్ చేస్తున్న తీరు ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టినట్లు అయింది అనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది.

ముఖ్యంగా రాజధాని కోసం రెండవ సారి భూ సమీకరణ విషయంతో పాటు ఇప్పటికే రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో మంత్రి నారాయణ అండ్ టీం వ్యవహరించిన విధానం తీవ్ర విమర్శల పాలు అయింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అవేమి పరిష్కరించకుండానే..రెండవ దశ భూ సమీకరణకు పూనుకోవటం...భూ సమీకరణకు ఒప్పుకుంటే ఓకే...లేదు అంటే భూ సేకరణ చేస్తాం అని రైతులను బెదిరించే ధోరణిలో నారాయణ ప్రకటనలు ఉండేవి. ఈ మొత్తం వ్యవహారం టీడీపీ కి మైనస్ గా మారింది. దీంతో వ్యవహారం శృతిమించుతుంది అని గ్రహించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి విషయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ తో పాటు మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ల తో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు ఈ మొత్తం వ్యవహారాన్ని సింగిల్ గా హ్యాండిల్ చేసిన మంత్రి నారాయణ తో పాటు పెమ్మసాని చంద్ర శేఖర్, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ లు కూడా రైతుల విషయంలో డీల్ చేస్తున్నారు.

అందుకే ఇప్పుడు గతంతో పోలిస్తే కొంత వేగంగా నిర్ణయాలు వెలువడుతున్నాయి. అయితే ఇది కూడా ఏ మాత్రం సరిపోదు అని...ఈ మొత్తం వ్యవహారం పరిశీలించటానికి..మొత్తం పనుల్లో వేగం పెంచటానికి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున జనసేన తో పాటు బీజేపీ సభ్యులతో కూడా ఒక కమిటీ వేసి ఎప్పటికప్పుడు వీరి ఫీడ్ బ్యాక్ ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. గతానికి భిన్నంగా ఈ సారి మంత్రి నారాయణ వ్యవహరిస్తున్నారు అనే ఫీలింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు అనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది.

Next Story
Share it