జగన్ బాటలోనే చంద్రబాబు
తెలుగు దేశం నాయకులకు ..శ్రేణులకు టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంపిన సంకేతాలు ఏంటి?. ఆంధ్ర ప్రదేశ్ కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ విషయంలో జగన్ మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ విధానంతో మొత్తం ప్రాజెక్ట్ ను రివర్స్ చేశారు అని టీడీపీ నేతలు గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మేఘా ఇంజనీరింగ్ కు పోలవరం పనులు అప్పగించినా మేము ఎలాంటి చర్యలు తీసుకోము. రివర్స్ టెండరింగ్ తర్వాత కూడా మేఘా కే అదనపు పనులు అప్పగించినా వాటికి కూడా ఓకే చెపుతాం. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ...తాము ఒకటే అనే సంకేతాలు చంద్రబాబు పంపినట్లు అయింది అనే చర్చ టీడీపీ నేతల్లో సాగుతోంది.
ఎందుకంటే ఆయన శనివారం నాడు మేఘా ఇంజనీరింగ్ అధినేత మేఘా కృష్ణారెడ్డి కట్టించిన డోకిపర్రు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గుడికి పోవటాన్ని ఎవరూ తప్పు పట్టారు. కానీ ఎవరితో వెళ్ళాం...వాళ్ళు ఎవరు అన్నది మాత్రం ఇక్కడ ఖచ్చితంగా చర్చకు వస్తుంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఆరోపణలు ఉన్న వాళ్ళు ..వివాదాస్పద వ్యక్తులకు చాలా దూరంగా ఉండేవారు. కానీ ఇప్పుడు అవేమి పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. మొన్నటికి మొన్న అత్యంత వివాదాస్పదమైన సానా సతీష్ కు పార్టీ తరపున రాజ్య సభ సీటు కేటాయింపు విషయంలో కానీ..ఇప్పుడు మేఘా తో కలిసి నడవటం విషయంలో కానీ. జగన్ మోహన్ రెడ్డి హయాంలో మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఒక్క పోలవరం ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా వేల కోట్ల రూపాయల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ లు కట్టబెట్టారు. అధిక రేట్లకు ఈ ప్రాజెక్ట్ లు కట్టబెట్టడం వాళ్ళ ప్రభుత్వ ఖజానాపై వందల కోట్ల రూపాయల భారం పడుతుంది అనే ఆరోపణలు వచ్చాయి గతంలోనే.
ఇవే కాదు...మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణ కాంట్రాక్టులు కూడా మేఘా కే జగన్ హయాంలో కేటాయించారు అని...దీని వెనక కూడా పెద్ద కథ నడిచింది అని అధికార వర్గాలు చెపుతున్న మాట. ఇదే మేఘా పై జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా పట్టిసీమ ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీ కే పోలవరం ప్రాజెక్ట్ తో పాటు వేల కోట్ల రూపాయల పనులు అప్పగించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా జగన్ హయాంలో ఇచ్చిన పోలవరం వంటి ప్రాజెక్ట్ ల ను టచ్ చేయకుండా..మేఘా ..మేమూ ఒకటే అన్నట్లు వ్యవహరిస్తున్నారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.