Telugu Gateway
Andhra Pradesh

ఎస్ఈసీ లేఖాస్త్రాలు

ఎస్ఈసీ లేఖాస్త్రాలు
X

మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, సజ్జలపై గవర్నర్ కు ఫిర్యాదు

ప్రవీణ్ ప్రకాష్ ను తప్పించండి

పంచాయతీ ఎన్నికల వేళ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరింత దూకుడు పెంచారు. సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు. ప్రవీణ్ ప్రకాష్ ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చూడాలని కోరారు. ఎన్నికల వేళ ఆయన కలెక్టర్లు, ఎస్పీలతో ఎలాంటి సమీక్షలు జరపకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 23న కలెక్టర్లు, ఎస్సీలతో నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్స్ ముందుకు సాగకుండా చేయటంలో ప్రవీణ్ ప్రకాష్ కీలకపాత్ర దారిగా ఉన్నారని, జీఏడీ బాధ్యతలు చూస్తున్న ఆయన తన ఆదేశాలను పట్టించుకోలేదని తెలిపారు. ప్రవీణ్ ప్రకాష్ కారణంగానే ఎన్నికల షెడ్యూల్ ను వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. దీంతో పాటు ఏపీ ప్రభుత్వ మంత్రులు, సలహాదారులపై కూడా రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. వారిని కట్టడి చేయాలని లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి ఉంటుందని ఆ లేఖలో పేర్కొన్నారు.

ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని, రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు. ఎన్నికల కమిషన్ పై సజ్జల చేసిన వ్యాఖ్యలను ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డి కూడా లక్ష్మణరేఖలు దాటారని తెలిపారు. ముందస్తు సమాచారంగా గవర్నర్ దృష్టికి తీసుకొచ్చానని..దీనిపై న్యాయపరంగా ముందుకెళ్ళే అవకాశం ఉందన్నారు. సజ్జలపై చర్యలు తీసుకోవాలంటూ..మంత్రులపై కడా గవర్నర్ కు ఎస్ఈసీ లేఖ రాయటంతో వ్యవహారం మరింత ముదిరిపాకాన పడినట్లు అయింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందించారు.

Next Story
Share it