Telugu Gateway
Andhra Pradesh

ఏపీ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ పై సుప్రీం స్టే

ఏపీ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ పై సుప్రీం స్టే
X

దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించిన ఏపీ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి రమణ కుమార్తెలు, మరి కొంత మంది అమరావతిలో కొనుగోలు చేసిన భూముల వ్యవహారంపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనిపై దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. హైకోర్టు స్టే ఇవ్వటమే కాకుండా ఈ ఎఫ్ఐఆర్ కు సంబంధించిన అంశాలు మీడియాతోపాటు సోషల్ మీడియాలో కూడా ప్రచురించవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఈ అంశంపై ఏపీ సర్కారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై బుధవారం నాడు విచారణ జరిగింది. సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. తదుపరి విచారణను 2021జనవరికి వాయిదా వేసింది.

అప్పటి వరకు ఈ కేసును ఫైనల్‌ చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. . జస్టిశ్ అశోక్ భూషణ్, ఆర్. సుభాష్ రెడ్డి, ఎం ఆర్ షాలతో కూడిన బెంచ్ ఆ ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటీషన్ పై ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధావన్ తన వాదనలు వినిపించారు. ''నేరం జరిగిన తర్వాత దర్యాఫ్తు చేయవద్దా. విచారణ వద్దు, మీడియా రిపోర్టింగ్ వద్దు అంటారు. ఈ కేసులో అసలు ఏమీ జరగకూడదా. మాజీ అడ్వకేట్‌ జనరల్‌ కోర్టును ఆశ్రయిస్తే 13మందికి ఈ ఆర్డర్స్‌ ఎలా వర్తింపజేస్తారు. కేసు వివరాలు ఎందుకు వెల్లడి కావొద్దు. పిటిషనర్ అడగకుండానే ఇలాంటి ఆదేశాలు ఎలా ఇస్తారు'' అంటూ దిగువ న్యాయస్థానం వ్యవహరించిన తీరును రాజీవ్‌ ధావన్‌ సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్‌ ఆర్డర్‌పై స్టే విధిస్తూ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.అయితే అత్యంత కీలకమైన సిట్ విచారణ స్టేపై మాత్రం సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవటం విశేషం. వాస్తవానికి ఏపీ ప్రభుత్వానికి ఇది విచారణలో ముందుకు పోవటానికి అత్యంత కీలకం.

Next Story
Share it