గవర్నర్ తో ఎస్ఈసీ రమేష్ కుమార్ భేటీ
ఏపీలో పంచాయతీ ఎన్నికలు సాఫీగా సాగేందుకు ఎట్టకేలకు రంగం సిద్ధం అయింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీ సర్కారు కూడా మరో మార్గం లేక ఎన్నికలకు ఓకే చెప్పేసింది. ఉద్యోగులను కూడా దారిలోకి రావాల్సిందేనని తేల్చిచెప్పింది..ఈ తరుణంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం ఉదయం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో సమావేశం అయ్యారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను ఆయనకు నివేదించారు. ఉద్యోగులు ఎస్ఈసీకి సహరించేలా చూడాలని కోరటంతో పాటు తాజాగా పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఉన్నతాధికారులపై తీసుకున్న చర్యలను కూడా గవర్నర్ కు తెలిపినట్లు సమాచారం.
ఎస్ఈసీతో పాటు గవర్నర్ తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఎన్నికలకు సంబంధించి ఏపీ సర్కారు, ఎస్ఈసీ మధ్య జరిగిన పోరులో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పరిణామాలను గమనిస్తూ ఉన్నారే తప్ప..ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. దీనిపై టీడీపీ ఆయనపై విమర్శలు చేసింది. ఇదిలా ఉంటే బుధవారం నాడు ఎస్ఈసీ రమేష్ కుమార్ ఎన్నికలకు సంబంధించి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.