Telugu Gateway
Andhra Pradesh

వైసీపీ ఆరోపణలు నిజం కాదు

వైసీపీ ఆరోపణలు నిజం కాదు
X

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం నాడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని అధికార వైసీపీ బాయ్ కాట్ చేసింది. ఈమేరకు మంగళవారం రాత్రే ఎందుకు తాము ఈ సమావేశానికి వెళ్ళటం లేదో వైసీపీ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. అయితే వైసీపీ మినహా మిగిలిన పార్టీలు అన్నీ ఎస్ఈసీ నిర్వహించిన సమావేశానికి వచ్చి తమ అభిప్రాయాలను తెలిపాయి. జనసేన ఈ మెయిల్ ద్వారా తమ అభిప్రాయాలను తెలిపింది. ఎస్ఈసీ సమావేశానికి హాజరైన ప్రధాన పార్టీలు అన్నీ ఎన్నికల నిర్వహించాలనే కోరాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం జిల్లాల విభజన పూర్తయిన తర్వాత ఎన్నికలు పెట్టాలని కోరింది. సమావేశం అనంతరం ఎస్ఈసీ రమేష్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. దీంట్లో ఆయన వైసీపీ చేసిన ఆరోపణలను ఖండించారు. ఎన్నికల నిర్వహణకు ముందు ప్రభుత్వంతో సంప్రదించటం లేదన్న ఆరోపణలను తోసిపుచ్చారు. కరోనా పరిస్థితిపై తాను ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వైద్యారోగ్యశాఖ కమిషనర్‌తో చర్చలు జరిపినట్లు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తెలిపారు.

తమ అభిప్రాయాలు తెలిపేందుకు 11 పార్టీలు హాజరైనట్లు వెల్లడించారు. రెండు పక్షాలు మాత్రం లిఖితపూర్వక సమాధానాలు పంపినట్లు పేర్కొన్నారు. సమావేశానికి ఆరు రాజకీయ పక్షాలు హాజరుకాలేదన్నారు. సీఎస్ నీలం సాహ్నితో కూడా రమేష్ కుమార్ భేటీ అయ్యారు. సీఈసీ అనుసరిస్తున్న విధానాలనే రాజకీయపక్షాల గుర్తింపు, సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా అమలు చేసినట్లు వివరించారు. కోవిడ్-19 మార్గదర్శక సూత్రాలను పాటించినట్లు తెలిపారు. సామాజిక దూరం, జాగ్రత్తలను అనుసరించడానికి, సమయ స్లాట్‌లతో వ్యక్తిగత సంప్రదింపులు ఉత్తమమైందిగా భావించినట్లు చెప్పారు. సురక్షితమైన అంశంగా భావించి ఈ విధానాన్ని అమలు చేసినట్లు స్పష్టంచేశారు. అయితే వైసీపీ మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరును తప్పుపడుతోంది.

Next Story
Share it