ఇప్పటికే చేయాల్సిదంతా చేశాం
ఉద్యోగులకు సమస్య పరిష్కరించుకునే ఉద్దేశం ఉన్నట్లు కన్పించటంలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. బలప్రదర్శనల వల్ల సమస్య మరింత జఠిలం అవుతుందన్నారు. ఉద్యోగులతో చర్చలకు ప్రభుత్వం ఎప్పుడైనా సిద్ధంగా ఉందన్నారు. ఇలాంటి ప్రదర్శలన వల్ల ఘర్షణ వాతావరణం పెరుగుతుందన్నారు. ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంపు వల్ల కూడా ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడుతుందని పేర్కొన్నారు. కరోనా సమయంలో కూడా ఐఆర్ తగ్గకుండా ఇచ్చామన్నారు. కోవిడ్ పరిస్థితులు ఎప్పటికి సర్దుకుంటాయో తెలియదన్నారు. గురువారం సజ్జల మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలను అనేక సార్లు చర్చలకు పిలిచామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న మేరకు మంచి నిర్ణయం తీసుకున్నామని సజ్జల పేర్కొన్నారు. 'పీఆర్సీ నిర్ణయం గురించి అన్నీ వివరించాం. మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల సంఖ్య పెరిగింది.
పీఆర్సీ ఏ విధంగా రూపొందించారో ప్రభుత్వం వివరించింది. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో జీతాలు ఇస్తున్నాం. కాంట్రాక్టు సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాం. కోవిడ్ వల్ల రెండేళ్లుగా ఆర్థిక పరిస్థితి కుదేలైంది. ఉన్న పరిస్థితుల్లో చేయాల్సిందంతా చేశాం. ఉపాధ్యాయులకు చాలా మేలు చేశాం. సర్వీస్ సంబంధిత అంశాలెన్నింటినో పరిష్కరించామని '' సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పీఆర్సీ వల్ల ఎక్కువ ఆశించటం వల్లే ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందన్నారు. సజ్జల తోపాటు సీఎస్ సమీర్ శర్మ కూడా ఇదే అంశంపై మీడియాతో మాట్లాడారు. సమ్మె చేస్తే ఏమి వస్తుందని ఆయన ఉద్యోగులను ప్రశ్నించారు. చర్యలు ఒక్కటే సమస్యకు పరిష్కారం అన్నారు. ఎక్కడ జీతం తగ్గిందో చెపితే కదా మాకకు తెలిసేది అన్నారు. మీకు కావాల్సింది ఏమిటో చెపితే మాట్లాడతామన్నారు. పాత వాటితో పీఆర్సీని పోల్చిచూడాలని కోరారు. ఆందోళనలు, సమ్మెల వల్ల ఉపయోగం ఉండదని..ఉద్యోగులు దయచేసి సమ్మె విరమించాలని కోరారు.