Telugu Gateway
Andhra Pradesh

అధికారులు కూడా వెళ్లని ప్రాంతాలకు డిప్యూటీ సీఎం

అధికారులు కూడా వెళ్లని ప్రాంతాలకు డిప్యూటీ సీఎం
X

పార్వతీపురం మన్యం జిల్లా బాగుజోల వంటి ప్రాంతాల్లో అధికారులు పర్యటించేది ఎప్పుడో. ఈ శుక్రవారం నాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అక్కడికి రావటంతో ఉన్నతాధికారులు అందరూ పరుగులు పెట్టాల్సి వచ్చింది. పైగా వర్షం కూడా రావటంతో వీళ్ళు మరింత ఇబ్బంది పడ్డారు. సహజంగా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఎక్కువ శాతం ఆఫీస్ లో కూర్చునే తమ విధులు నిర్వహిస్తారు. ఎప్పుడో కానీ వాళ్ళు క్షేత్రస్థాయి పర్యటనలు చేయరు. కానీ పవన్ టూర్ లో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు ఇతర అధికారులు అందరూ కూడా వర్షంలో తడుస్తూ, బురదలో ఆయనతో కలిసి తిరగాల్సి వచ్చింది. వాస్తవానికి అధికారులు కార్లు తిరిగే ప్రాంతంలోనే పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాటు చేయాలని భావించారు.

కానీ వర్షంలో కూడా ఉప ముఖ్యమంత్రి నడుచుకుంటూ కొండ ప్రాంతాల్లో పర్యటించటంతో వీళ్ళు కూడా ఆయన్ను అనుసరించక తప్పలేదు. వర్షంలో...బురదలో తిరగటం ఏ మాత్రం అలవాటు లేని అధికారులు పవన్ కళ్యాణ్ టూర్ తో చుక్కలు చూశారు అనే చెప్పాలి. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని 19 గిరిజన గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఉపాధి హమీ పథకం కింద రూ. 20.11 కోట్ల అంచనా వ్యయంతో వీటిని నిర్మించనున్నారు. వీటితోపాటు మొత్తం రూ. 36.71 కోట్ల అంచనా వ్యయంతో 39.32 కిలోమీటర్ల మేర 19 నూతన రోడ్లు నిర్మించనున్నారు. ఈ రోడ్ల నిర్మాణంతో 55 గిరిజన గ్రామాల్లో నివశిస్తున్న సుమారు 3,782 మంది గిరిజనులు డోలీ మోత కష్టాల నుంచి విమక్తి పొందనున్నారు. మరో వైపు పవన్ కళ్యాణ్ అభిమానులనుద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీసాలు తిప్పితే ...గుండెల మీద బాదుకుంటే రోడ్లు రావు అని..ప్రధాని, ముఖ్యమంత్రులను కలిస్తేనే గ్రామాలకు రోడ్లు వస్తాయన్నారు. తన పని తనను చేసుకోనివ్వాలని..ప్రతిసారి ఓజీ ఓజీ అంటూ అరవద్దు అంటూ ఫ్యాన్స్ కు సూచించారు.

Next Story
Share it