జనసేన అలా...టీడీపీ ఇలా!

రాజకీయం అయినా..సినిమా అయినా అంతా మార్కెటింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఈ రెండు రంగాల్లో కంటెంట్ తో పాటు మార్కెటింగ్ కూడా ఎంతో కీలకం. ఎవరు ఎంత పర్ఫెక్ట్ గా మార్కెట్ చేసుకుంటే అంత ఎక్కువ కాలం మార్కెట్ లో నిలబడతారు. ఇప్పుడు ఇది అంతా ఎందుకు అంటే జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాలను ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ...అవి సక్సెస్ సాధించేలా వాళ్ళు గట్టిగానే ప్రయత్నాలు చేశారు..చేస్తున్నారు. ఇందులో తప్పుపట్టాల్సింది కూడా ఏమి లేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదల అయిన ఆయన తొలి సినిమా హరి హర వీర మల్లు కోసం ఏకంగా మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ నాయకులతో మాట్లాడిన ఆడియో ఒకటి లీక్ అయింది. తర్వాత అయన కూడా అధికారికంగా తమ అధినేత సినిమాను తాము ప్రమోట్ చేసుకోవటంలో తప్పు ఏముంది అని కూడా అధికారికంగా మీడియా సమావేశంలోనే చెప్పేశారు కూడా. ఫలితం ఎలా ఉన్నా కూడా హరి హర వీర మల్లు తో పాటు ఓజీ సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా జనసేన నాయకులు..క్యాడర్ చేయాల్సింది అంతా చేశారు.
ఎంత చేసినా హరి హర వీరమల్లు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభావం చూపించలేకపోయింది. ఓజీ విషయానికి వస్తే మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ రెండు సినిమాల విషయంలో కూడా జనసేన నేతలు తమకు వివిధ మార్గాల్లో వచ్చిన నిధులను కూడా వీటిని పుష్ చేయటం కోసం ఉపయోగించినట్లు ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో టీడీపీ మంత్రుల కంటే ఎక్కువ కంఫర్ట్ జోన్ లో ఉంది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే అనే చర్చ ఆ పార్టీ నేతల్లో సాగుతోంది. ఇది అంతా ఒకెత్తు అయితే పవన్ కళ్యాణ్ సినిమాలను జనసేన ఓన్ చేసుకుని పుష్ చేస్తుంటే...నందమూరి బాలకృష్ణ సినిమాలను టీడీపీ పూర్తిగా ఎందుకు వదిలేసింది అన్నది ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా విడుదల అయిన అఖండ 2 తాండవం సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకు ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ తో పాటు అమెరికా లో కూడా పార్టీ నుంచి ఏ మాత్రం మద్దతు లేకుండా పోయింది అనే చర్చ టీడీపీ నేతల్లో సాగుతోంది.
ఏ సినిమాకు అయినా ఎక్కువ కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్ అంటే...ఎక్కువ మొత్తం అమెరికా నుంచే వస్తాయనే విషయం తెలిసిందే. ప్రతి సారి బాలకృష్ణ సినిమాలను పెద్ద ఎత్తున ఓన్ చేసుకుని ప్రమోట్ చేసే ఎన్ఆర్ ఐ లు ఈ సారి ఏ మాత్రం పట్టించుకోలేదు అని...కేవలం అభిమానం ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్లి సినిమా చూశారు అని చెపుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇంచుమించు అదే పరిస్థితి. వనరుల పరంగా చూసుకుంటే జనసేన కంటే టీడీపీ పరిస్థితి ఎంతో బెటర్ గా ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు...క్యాడర్ సినిమా ను పుష్ చేయాలనే విషయాన్ని పూర్తి గా పక్కపెట్టారు అని చెపుతున్నారు. ఎన్ఆర్ ఐ ల దగ్గర నుంచి మొదలుపెడితే రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు తీరుతో ఎక్కువ మంది నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అని...ఎన్నికల్లో భారీగా ఖర్చుపెట్టుకున్నది చాలక ఇప్పుడు మళ్ళీ సినిమా ల కోసం కూడా డబ్బు ఎక్కడా ఖర్చుపెడతాం అని పూర్తి వదిలేశారు అనే చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది.
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు...నారా లోకేష్ లు రాజకీయంగా బాలకృష్ణ కు ఎలాగూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదు అని...కనీసం అవసరం అయినప్పుడు సినిమాలను పుష్ చేయటానికి కూడా ముందుకు రాకపోతే ఎందుకు అనే అభిప్రాయం కొంత మంది నేతల్లో ఉంది. ఒక్క సారి మార్కెట్ పడిపోతే తిరిగి లేవటం అంత ఈజీ కాదు. పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు చూపించిన శ్రద్ద బాలకృష్ణ అఖండ 2 విషయంలో ఏ మాత్రం పెట్టలేదు అనే అభిప్రాయం ఆ పార్టీ నాయకుల్లో కూడా ఉంది. అఖండ 2 సినిమా ఎక్కువ భాగం హైందవ ధర్మం. సనాతన ధర్మం ఫోకస్ గానే సాగుతుంది. కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ లో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా బాలకృష్ణ సినిమా ప్రమోషన్ విషయంలో హడావుడి చేస్తే పవన్ కళ్యాణ్ కు ఎక్కడ కోపం వస్తుందో అనే కోణంలో కూడా చంద్రబాబు, నారా లోకేష్ లు ఈ విషయాన్ని వదిలేసి ఉండొచ్చు అని టీడీపీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అఖండ 2 తాండవ ఫలితం రాబోయే రోజుల్లో బాలకృష్ణ సినిమాపై కూడా పడుతుంది అని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.



