Telugu Gateway
Andhra Pradesh

అంటే చాలా ముందుగా..పక్కాగా ప్లాన్ చేశారా!

అంటే చాలా ముందుగా..పక్కాగా ప్లాన్ చేశారా!
X

వైసీపీ నేతలు ఎప్పటి నుంచో ఒక మాట చెపుతూ వస్తున్నారు. మాకు అసలు పొత్తులు అక్కరలేదు..ఎవరితో దోస్తానా ఉండదు..సింహం సింగిల్ గానే వస్తుంది అంటూ వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి ఎలివేషన్స్ ఇచ్చేవాళ్ళు . కానీ ఇదే జగన్ ఒకసారి మనకు బీజేపీ అండ ఉండకపోవచ్చు అంటూ ఒక సారి బహిరంగ సభలో వాపోయిన విషయం తెలిసిందే. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా లు ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించిన సమయంలో జగన్ సర్కారుపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేశారు. వీటిని చూసే జగన్ ఆ మాటలు చెప్పారు..తర్వాత అంతా మళ్ళీ మామూలుగానే మారిపోయింది. వైసీపీ నేతలు ముఖ్యంగా టీడీపీ, జన సేన పొత్తు విషయంపై ఎంత తీవ్రంగా స్పందిస్తున్నారో అందరూ చూశారు...చూస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో వరసపెట్టి చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే వైసీపీ చెపుతున్న సింహం సింగిల్ అంటే ఇలాగా అనే చర్చ సాగుతోంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం విషయంలో ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ని అరెస్ట్ చేసి జైలు లో పెట్టారు. ఈ కేసు విషయంలో అధికార పార్టీ వాదన ఒకటి..టీడీపీ వాదన మరొకటి. ఎవరి వాదనలో నిజం ఉందో తేలాల్సింది ఇక కోర్టుల్లోనే. తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కూడా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంటు కేసులో ఏ14 గా చేర్చుతూ సిఐడి మెమో దాఖలు చేసింది. వాస్తవానికి గత ప్రభుత్వంలో పంచాయతీ రాజ్, ఐటి శాఖల మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు నిర్వహించారు. మరి లోకేష్ కు అసలు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు తో సంబంధం ఏమిటి అన్నది ఎక్కువ మందిలో ఉన్న సందేహం. మరి కోర్ట్ ఈ మెమో ను ఆమోదిస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే స్కిల్ డెవలప్ మెంట్ కేసు విషయానికి వస్తే ఆ ప్రాజెక్ట్ అమలు జరిగింది. కోట్లు ఖర్చుపెట్టారు. అందులోనే అవినీతి అని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు నిధులు చంద్రబాబు లేదా ఆయనకు సంబందించిన వారి ఖాతాల్లోకి వెళ్లినట్లు నిరుపిస్తేనే దీనికి బలం చేకూరుతుంది. ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ విషయానికి వస్తే ఇది కాగితాలు దాటి కాలు బయటపెట్టలేదు. కాగితాల మీద ఉన్న ప్రాజెక్ట్ విషయంలో అవినీతి జరిగినట్లు నిరూపించటం సాధ్యం అవుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే ఇన్నర్ రింగ్ రోడ్ మార్గంలోనే ఎల్ఈపీఎల్ భూములు రాకుండా తప్పించారు అని...అదే మార్గంలో హెరిటేజ్ పేరుతో భూములు కొనుగోలు చేస్తినట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది. మంగళవారం నాడు చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే ప్రచారం జరుగుతున్నట్లు గానే వైసీపీ ప్రభుత్వం నారా లోకేష్ ను కూడా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు లో అరెస్ట్ చేయటానికి రంగం సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ అయ్యారు...ఇప్పుడు నారా లోకేష్ ను అరెస్ట్ చేస్తే..ఇక మిగిలేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే. ఏదో ఒక కేసు లో పవన్ కళ్యాణ్ ను కూడా అరెస్ట్ చేస్తే ఇక అప్పుడు వైసీపీ మంత్రులు..నేతలు చెపుతున్నట్లు ఒక్క జగన్ మోహన్ రెడ్డి మాత్రమే బయటవుంటారు. వాళ్ళు చెప్పే సింహం సింగిల్ డైలాగు కూడా అప్పుడు బాగానే సెట్ అవుతుంది. అయితే వైసీపీ ప్రభుత్వం ఎంత కాలం చంద్రబాబు ను జైలు నుంచి బయటకు రాకుండా చూస్తుంది అన్నదే ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న. ఎందుకంటే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు లో అరెస్ట్ అయిన తర్వాతే వరసగా ఫైబర్ గ్రిడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో కూడా పీటి వారంట్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇవి కాకపోతే ఇంకా కొత్త కేసు లు తెర మీదకు తెచ్చే అవకాశం ఉంది అనే చర్చ వైసీపీ నేతల్లో కూడా ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో జరిగిన ప్రాజెక్ట్ లపై మంత్రుల కమిటీ వేసి నివేదికలు తెప్పించుకుని సరిగా ఎన్నికలకు ఆరు నెలల ముందు వీటిని తెరపైకి తెచ్చారు అంటే పక్క రాజకీయ కోణంలోనే అనే అభిప్రయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తప్పు చేసినవారిపై చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ ఇవి రాజకీయాలతో ముడిపడి ఉన్నందున టైమింగ్ అన్న విషయం కూడా ఖచ్చితంగా చర్చకు వస్తుంది అనటంలో సందేహం లేదు.

Next Story
Share it