Telugu Gateway
Andhra Pradesh

ర‌ఘురామ‌క్రిష్ణంరాజుతో ఆర్ధిక లావాదేవీల్లేవ్

ర‌ఘురామ‌క్రిష్ణంరాజుతో ఆర్ధిక లావాదేవీల్లేవ్
X

అధికారుల‌పై ప‌రువు న‌ష్టం కేసు వేస్తాం

ఏపీ స‌ర్కారు దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ లోని అంశాల‌ను టీవీ5 తీవ్రంగా ఖండించింది. రాజ‌ద్రోహం కేసులో టీవీ5పై ప్ర‌భుత్వం త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తుంద‌ని పేర్కొంది. సుప్రీం కోర్టులో ఫైల్ చేసిన అఫిడ‌విట్ లో అస‌త్యాలు ఉన్నాయ‌ని తెలిపింది. ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజుతో ఆర్ధిక లావాదేవీలు అంటూ క‌ట్టుక‌థ‌లు అల్లార‌న్నారు.2016లో రఘురామ‌క్రిష్ణంరాజుతో టీవీ5కి ఆర్ధిక లావాదేవీలు జ‌రిగిన‌ట్లు అఫిడ‌విట్ లో ప్ర‌స్తావించార‌న్నారు. ఇది కేసును త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్న‌మేన‌న్నారు. ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజుతో టీవీ5కి ఎలాంటి లావాదేవీలు లేవ‌ని స్ప‌ష్టం చేశారు.

ఎంపీకి డ‌బ్బులు బ‌దిలీ చేసిన‌ట్లు చేసిన ఆరోప‌ణ పూర్తిగా అవాస్త‌వం అన్నారు. త‌మ‌కు అలాంటి అవ‌స‌రం ఏమీలేద‌ని తెలిపారు. అదే స‌మ‌యంలో అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన అధికారుల‌పై ప‌రువు న‌ష్టం కేసు వేయ‌నున్న‌ట్లు టీవీ5 యాజ‌మాన్యం వెల్ల‌డించింది. ఏపీ ప్ర‌భుత్వ అఫిడవిట్ పై న్యాయ‌ప‌రంగా ముందుకెళ్తామ‌న్నారు.వాస్త‌వాలేంటో సుప్రీంకోర్టుకు నివేదిస్తామ‌ని తెలిపారు. సుప్రీంకోర్టులో ఏపీ ప్ర‌భుత్వం వేసిన అఫిడ‌విట్ లో టీవీ5, ఏబీఎన్ ఛాన‌ళ్లు తెలుగుదేశంతో క‌ల‌సి కుట్ర ప‌న్నాయంటూ ఈ ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

Next Story
Share it