Telugu Gateway
Andhra Pradesh

ఇలా ఎవరూ చేయలేదు...చంద్రబాబు

ఇలా ఎవరూ చేయలేదు...చంద్రబాబు
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మంగళవారం నాడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా సుప్రీంకోర్టు సీజెఐకి రాసిన లేఖపై స్పందించారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. 'గతంలో కేసులలో చిక్కుకున్న లాలూ ప్రసాద్ యాదవ్, మధుకోడా, జయలలిత, ఓం ప్రకాష్ చౌతాలా, శిబుసోరెన్ తదితరులు ఎవరూ కూడా న్యాయస్థానాలపై, న్యాయమూర్తులపై ఈ విధమైన దాడులు చేయలేదు. వ్యవస్థలపై దాడి చేసే దుస్సాహసానికి తెగబడలేదు. ఎన్నడూ చూడని దుర్మార్గ పాలన ఏడాదిన్నరగా మన రాష్ట్రంలో చూస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి ఉన్మాద పాలన చూడలేదు. నేరచరిత్రగల వాళ్లు అధికారంలోకి వస్తే ఎలాంటి ఉపద్రవం వాటిల్లుతుందో ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ. ఒక తప్పు చేయడం, ఆ తప్పును కప్పిపుచ్చుకోడానికి ఇంకా పెద్దతప్పు చేయడం జగన్మోహన్ రెడ్డికి నిత్యకృత్యం అయ్యింది. మీకిచ్చిన అధికారం ప్రజలను చంపడానికి లైసెన్స్ అనుకుంటున్నారా..? మీకు వేసిన ఓట్లు ప్రజలపై దాడులు చేయడానికి లైసెన్సా...? ప్రతిపక్షంపై దాడి, ప్రజలపై దాడి, మీడియాపై దాడి, న్యాయవ్యవస్థపై దాడి, రాజ్యాంగంపై దాడి, ప్రజాస్వామ్యంపై దాడి.

తన అవినీతి బురద ఇతరులకు అంటించడం, తప్పుడు వార్తలతో అపోహలు పెంచడం, ప్రశ్నించిన వాళ్లపై దాడులు చేయడం, బెదిరించి భయపెట్టి లోబర్చుకోవడం ద్వారానే ఇన్నాళ్లు జగన్మోహన్ రెడ్డి రాజకీయం సాగిస్తున్నారు. తప్పులు చేసి ఎవరూ తప్పించుకోలేరు, ఆ తప్పులే మిమ్మల్ని వెంటబడి తరుముతాయి. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ వేగవంతం చేయాలనే ఆదేశాలు ఇవాల్టివి కాదు. ఏడాది లోపు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు నాలుగేళ్ల క్రితమే ఆదేశించింది. అప్పటి ఆదేశాలనే ఇప్పుడు అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే 4,500 మంది ప్రజా ప్రతినిధులపై రోజువారీ విచారణ చేపట్టారు. అదేదో తన ఒక్కడిమీదే రోజువారీ విచారణ ప్రారంభమైనట్లు జగన్మోహన్ రెడ్డి బెంబేలెత్తడం, చివరికి న్యాయవ్యవస్థపైనే దాడి చేయడం బరితెగింపునకు పరాకాష్ట.. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా టిడిపి పనిచేస్తోంది. బాధ్యత గాలికి వదిలేసి అవినీతి కుంభకోణాల్లో వైసిపి మునిగి తేలుతోంది.' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Next Story
Share it