Telugu Gateway
Andhra Pradesh

రెండు అనుబంధ సంస్థలకు భూమి బదలాయింపు

రెండు అనుబంధ సంస్థలకు భూమి బదలాయింపు
X

నారా లోకేష్ సారథ్యంలోని ఆంధ్ర ప్రదేశ్ ఐటి శాఖలో గోల్ మాల్ వ్యవహారాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒప్పందం సమయంలో ఒకటి...ఒప్పందం జరిగిన తర్వాత మళ్ళీ కంపెనీ అడిగింది అని...లెటర్ రాసింది అని వీటిలో మార్పులు చేయటం ఒక రొటీన్ వ్యవహారంగా మారిపోయినట్లు కనిపిస్తోంది. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ మొదలు కొని పలు ప్రాజెక్ట్ ల విషయంలో ఇదే జరుగుతోంది. గూగుల్ డేటా సెంటర్ కోసం తొలుత 480 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం కొద్దీ రోజుల తర్వాతే ఈ మొత్తాన్ని 601 ఎకరాలు పెంచింది. ఉద్యోగాల కల్పన పేరుతో దిగ్గజ ఐటి కంపెనీలతో పాటు ఫక్తు రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం తన విధానాలను కూడా తానే ఉల్లఘింస్తోంది. మొదటి నుంచి కూడా స్వయంగా నారా లోకేష్ బెంగుళూర్ వెళ్లి సాదించుకొచ్చాడు అని చెపుతున్న సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ సర్కారు ప్రత్యేక ప్రేమ చూపిస్తోంది.

ఈ కంపెనీకి ప్రభుత్వం ఎకరా కోటిన్నర లెక్కన మధురవాడలో మొత్తంలో 30 ఎకరాలు కేటాయించింది. ఈ భూమి విలువే మార్కెట్ రేట్ పరంగా చూసుకుంటే ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలపైనే ఉంటుంది. అయినా సరే కంపెనీకి ప్రభుత్వం భూములు కేటాయించిన తర్వాత కూడా సకాలం లో డబ్బులు కట్టకుండా ఎలాంటి వడ్డీ లేకుండా గడువు ముగిసిన 60 రోజుల తర్వాత 45 కోట్ల రూపాయలు చెల్లించేందుకు అనుమతి కోరింది..ఇందుకు సర్కార్ సై అంటూ జీవో కూడా జారీ చేసింది. ఇప్పుడు మళ్ళీ సత్వా ప్రాజెక్ట్ కు సర్కారు మరికొన్ని వెసులుబాట్లు కల్పించింది. వైజాగ్ లో ఐటి తో పాటు ఐటి ఆధారిత సేవల కంపెనీలకు అవసరం అయిన ఆఫీస్ స్పేస్ డెవలప్ చేయటంతో పాటు రిటైల్, రెసిడెన్షియల్ స్పేస్ డెవలప్ మెంట్ కోసం అని ప్రభుత్వం ఈ సంస్థకు 30 ఎకరాలు కేటాయించింది. కంపెనీ 1500 కోట్ల రూపాయల పెట్టుబడితో 25000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది అని చెపుతోంది. సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు సర్కారు 2025 ఆగస్ట్ 1 న భూ కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే ..కంపెనీ 2026 మార్చి 10 న ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది.

తమకు కేటాయించిన 30 ఎకరాల భూమిని తమ అనుబంధ సంస్థలు అయిన సత్వా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్వెల్ హోరిజాన్ ప్రైవేట్ లిమిటెడ్ కు సేల్ అగ్రిమెంట్ లు చేయాలని కోరింది. ఇందులో సత్వా ప్రాపర్టీస్ రెసిడెన్షియల్ స్పేస్ అభివృద్ధి ప్రాజెక్ట్ చేపడుతుంది అని...ఆర్వెల్ హోరిజాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఐటి, ఐటి ఈఎస్ ప్రాజెక్ట్ చేపడుతుంది అని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటిలాగానే ఎస్ఐపీబి ముందు పెట్టి ఆమోదించింది. అయితే ఈ రెండు అనుబంధ సంస్థల్లో ఒరిజినల్ గా భూమి దక్కించుకున్న కంపెనీ సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కచ్చితంగా 51 శాతం వాటా కలిగి ఉండాలనే నిబంధనతో అనుమతి మంజూరు చేశారు. అంటే ప్రభుత్వం నుంచి కారు చౌకగా వేల కోట్ల రూపాయల భూములే కాకుండా...రాయితీలు..ప్రోత్సహకాలు దక్కిచుకున్న సంస్థలు ఈ ప్రాజెక్ట్ ల్లో 49 శాతం వాటాలను విక్రయించుకోవటానికి కూడా అనుమతి ఇచ్చినట్లు అయింది అని అధికార వర్గాలు చెపుతున్నాయి. అయితే వీటిలో వాటాలు రాబోయే రోజుల్లో ఎవరికీ దక్కుతాయో చూడాలి అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు.

Next Story
Share it