తెలివైనవాళ్ళు ముందుగానే లోకేష్ ట్రాక్టర్ దిగండి
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కు పార్టీ నడపటం రాదు..ట్రాక్టర్ నడపటం రాదన్నారు. కొల్లేటిలో ట్రాక్టర్ ను ఏ విధంగా దించారో టీడీపీని కూడా అలాగే దించుతాడు. బుధ్ధి ఉన్న వాళ్లు ముందే మేల్కొని ట్రాక్టర్ దిగి వెళ్లిపోండి అని వ్యాఖ్యానించారు. ఎవరైనా మొదటి పర్యటన కొల్లేరులో పెట్టుకుంటారా అని ఎద్దేవా చేశారు. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా లోకేష్ వైఖరి ఉందన్నారు.
లోకేష్ గురించి ఎక్కువ మాట్లాడటం వేస్ట్ అని వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు నందిగామ పర్యటన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రాక్టర్ నడపటం రాని వ్యక్తి పార్టీని నడుపుతారా? అని ప్రశ్నించారు. కొల్లేటిలో ట్రాక్టర్ ను ముంచినట్లు..పార్టీని కూడా అలాగే ముంచి ఆయన దిగిపోతారన్నారు. సోమవారం నాడు ట్రాక్టర్ సంఘటనపై వైసీపీ సోషల్ మీడియా కూడా నారా లోకేష్ ను ట్రోల్ చేస్తోంది. ఇదిలా ఉంటే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంపై నారా లోకేష్ పై ఆకివీడులో కేసు కూడా నమోదు అయింది.