ఇప్పుడు హీరో లు చెట్లు కొట్టి..స్మగ్లింగ్ చేస్తున్నారు
జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలిసారి నేరుగా అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారా?. గురువారం నాడు ఆయన బెంగళూరు లో చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాకమానదు. గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ల మధ్య రాజకీయ వివాదం తలెత్తింది. దీనికి ప్రధాన కారణం అల్లు అర్జున్ గత ఎన్నికల ముందు వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి కి మద్దతుగా ప్రచారం చేయటమే. పవన్ కళ్యాణ్ కోసం కేవలం ట్వీట్ చేసి...రాజకీయంగా జనసేన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్ ఏకంగా కుటుంబంతో కలిసి వెళ్లి మరీ మద్దతు ప్రకటన చేశారు. ఇది జనసేన కార్యకర్తలతో పాటు పవన్ అభిమానులకు ఏ మాత్రం నచ్చలేదు. అప్పటి నుంచి ఈ వివాదం ఏదో ఒక రూపంలో సాగుతూనే ఉంది. ఇటీవల పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా టాలీవుడ్ ఎవరి తాత సొత్తు కాదు అంటూ వ్యాఖ్యానించారు. ఇది కూడా అల్లు అర్జున్ ను టార్గెట్ చేసుకునే చేశారు అని చర్చ సాగింది. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ నేరుగా అల్లు అర్జున్ కు తగిలేలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 40 సంవత్సరాల క్రితం హీరో అడవులను కాపాడే వాడు..కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు అంటూ మాట్లాడారు.
తాను కూడా సినిమా పరిశ్రమకు చెందినవాడినే అయినా కూడా అంటూ ఈ మాటలు అన్నారు. సంచలన విజయం దక్కించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమా అంతా కూడా అడవుల్లో ఎర్రచందనం చెట్లు కొట్టి..స్మగ్లింగ్ కథతోనే సాగిన విషయం తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ మాటలు అల్లు అర్జున్ ను టార్గెట్ చేసుకుని చేసినవే అన్న చర్చ తెరమీదకు వచ్చింది. దీనికి కారణం గత కొంత కాలంగా రెండు కుటుంబాల మధ్య ఉన్న గ్యాప్ కూడా. పవన్ కళ్యాణ్ మరో వైపు కన్నడ సినిమా గంధడ గుడి గురించి కూడా ప్రస్తావించారు. ఇది అడవులను, ప్రకృతినే రక్షించాలనే ఉద్దేశంతో తీసిన సినిమా. దీంతో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పుష్ప సినిమా ను టార్గెట్ చేసుకునే ఈ మాటలు అన్నట్లు స్పష్టం అవుతోంది. ఈ ఏడాది డిసెంబర్ ఆరున సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప 2 విడుదల కు రెడీ అవుతోంది. ఈ సినిమా విడుదలకు కొద్ది నెలల సమయం ముందు పవన్ కళ్యాణ్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఖచ్చితంగా పుష్ప 2 పై ప్రభావం చూపించే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ పై ఫుల్ గరంగా ఉన్న పవన్ ఫ్యాన్స్ కు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో మరింత రెచ్చిపోయే అవకాశం లేకపోలేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.