నినాదాలతో అంత ఈజీగా నమ్మేస్తారా!
ప్రతిపక్షంలో ఉంటే కార్యకర్తలే మా ప్రాణం అంటారు. పవర్ లోకి వచ్చిన తర్వాత మాత్రం అధికారులే మా ఆశ..శ్వాస అన్నట్లు వ్యవహరిస్తారు టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోకి కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత కూడా ఇదే పరిస్థితి. ఇటీవల కొంత మంది ఎమ్మెల్యేలు అయితే ఏకంగా తమకు అధికారులు సమయం కూడా ఇవ్వటం లేదు అని స్పీకర్ కు ఫిర్యాదు చేయటం...స్పీకర్ ఈ విషయంలో ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి కూడా తెలిసిందే. ఎమ్మెల్యే ల కే అధికారులు కనీసం సమయం ఇవ్వటం లేదు అంటే ఇంకా ఇతర నేతలు..కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అంటే వాళ్ళు చెప్పిన పనులు చేయాలని కాదు. పార్టీ అయినా కనీసం వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ గత ఏడాది కాలంగా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ అధిష్టానం తీరుపై నాయకుల్లోనే కాకుండా క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది.
అంతే కాకుండా మొన్నటి ఎన్నికల్లో కేవలం తమ వల్లే అధికారంలోకి వచ్చినట్లు అటు చంద్రబాబు తో పాటు ఇటు నారా లోకేష్ కూడా చెప్పుకుంటున్నారు. వీళ్లిద్దరి పాత్రను ఎవరూ కాదనరు. అదే సమయంలో వైసీపీ హయాంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మహానాడు వేదికగా నారా లోకేష్ ఆరు శాసనాలు అనే కాన్సెప్ట్ ను తెర మీదకు తెచ్చారు. అందులో ఒకటి కార్యకర్తే అధినేత. అంటే ఇక కార్యకర్తే అధినేత అని చెప్పి వాళ్ళు ఏమి మాట్లాడినా..అడిగినా కూడా మీదే పార్టీ అని చెప్పి తప్పించుకోవటం కోసమే ఈ ప్లాన్ చేసారా అన్న చర్చ టీడీపీ నేతల్లో సాగుతోంది. అసలు కార్యకర్తే అధినేత అనే కాన్సెప్ట్ అసలు ఉద్దేశం ఏంటో తేలాల్సి ఉంది అని చెపుతున్నారు. కార్యకర్తలకు ఆర్థిక స్వాలంబన కలిపించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం అని ప్రకటించారు.
అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే మహానాడు లో తన స్పీచ్ లో నారా లోకేష్ రాష్ట్రానికి సాధించిన పెట్టుబడుల గురించి చెపుతూ టీసీఎస్, ఆర్సెలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ల పేరులు ప్రస్తావించారు కానీ తాను తెచ్చిన ఉర్సా క్లస్టర్స్ ఊసు ఎత్తలేదు. కానీ ఈ కంపెనీ కి కేటాయించిన భూమి ధర విషయంలో మాత్రం మీడియా తో నిర్వహించిన చిట్ చాట్ లో మాత్రం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి సవాల్ విసిరారు. ఉర్సా కు ఎకరా 99 పైసలకు కేటాయించినట్లు నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఈ సవాల్ విషయం కాసేపు అటుంచితే రాష్ట్రానికి సాధించిన పెట్టుబడుల విషయంలో లోకేష్ కూడా ఉర్సా పేరు మహానాడు వేదికగా చెప్పటానికి ఆసక్తి చూపించలేదు అంటే ఆ కంపెనీ సత్తా ఏంటో అర్ధమవుతుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.