Telugu Gateway
Andhra Pradesh

బీచ్ షాక్స్ కు మంత్రి వర్గం ఆమోదం

బీచ్ షాక్స్ కు మంత్రి వర్గం ఆమోదం
X

సందర్శకులు..పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చే ప్రదేశాల్లో బీచ్ లు ముందు వరసలో ఉంటాయి. కుటుంబ సభ్యులతో సహా అందరూ కలిసి సముద్ర తీరంలో సేద తీరుతుంటారు. ఇంతటి రద్దీ ఉండే ప్రాంతాల్లో ఏకంగా మద్యం విక్రయాలకు ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ బీచ్ షాక్స్ (తాత్కాలికంగా నిర్మించే గుడిసెలు) ముందు వైజాగ్ బీచ్ తో పాటు చీరాల బీచ్ ల్లో అమలు చేయనున్నారు. తర్వాత దీన్ని మరిన్ని బీచ్ లకు విస్తరిస్తారు. ఈ మేరకు గురువారం నాడు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అద్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇవి ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటాయి. బీచ్ షాక్స్ ఏర్పాటుకు వీలుగా ఆంధ్ర ప్రదేశ్ ఎక్సయిజ్ పోలీస్ లో మార్పులు చేయటానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు గోవా లో ఉన్న తరహాలోనే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా బీచ్ ల్లో మందు కొట్టే అవకాశం రానుంది. దీని ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో తెలియదు కానీ.....కుటుంబ సభ్యులు అందరితో కలిసి తిరిగే బీచ్ ల వంటి ప్రాంతాల్లో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయటం వల్ల కొత్త సమస్యలు రావటం ఖాయం అని అధికారులు అభిప్రాయపడుతున్నారు. గోవా లో కూడా పలు మార్లు పర్యాటకులు మందు బాబుల వల్ల ఎన్నో సార్లు ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి నిత్యం వార్తలు వస్తూనే ఉంటాయి. పర్యాటకం పేరుతో ఏకంగా బీచ్ ల్లో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వటం ద్వారా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోకతప్పదు అనే చెప్పొచ్చు.

Next Story
Share it