Telugu Gateway
Andhra Pradesh

అప్పుడు హైదరాబాద్ లో ..ఇప్పుడు వైజాగ్ లో !

అప్పుడు హైదరాబాద్ లో ..ఇప్పుడు వైజాగ్ లో !
X

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల మనిషి అనే కంటే కార్పొరేట్ల మనిషి అనే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏది కోరుకుంటే ఆయన అది చేసిపెడతాడు కాబట్టే వాళ్ళు అందరూ కలిసి ఆయనకు సీఈఓ ట్యాగ్ ఇచ్చారు. అవకాశం ఉన్న ప్రతి చోట దార్శనికుడు అని పొగుడుతూ ఉంటారు. ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ప్రజలందరి ఉమ్మడి ఆస్తిని అలవోకగా బడా బడా కంపెనీలకు కట్టబెట్టి తెర వెనక లావాదేవీలు చేస్తారు అనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. లేకపోతే ఏ ప్రభుత్వం అయినా వేల కోట్ల రూపాయల ఆస్తులను ఉదారంగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతుందా?. కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఇచ్చేటప్పుడు..రాయితీలు కల్పించేటపుడు అది చంద్రబాబు నాయుడి సర్కారు అయినా..మరో ప్రభుత్వం అయినా చెప్పే ఒకే ఒక మాట ఉద్యోగాల కల్పన. పెట్టుబడుల ఆకర్షణ.

ఈ పేరుతోనే వాళ్లకు కావాల్సిన పనులు అలా చేసుకుంటారు. పారిశ్రామిక అవసరాలకు..ఇతర సంస్థలకు భూములు ఇవ్వటం తప్పు కాకపోయినా....కంపెనీ కంపెనీకి ఒక మోడల్ అనుసరించటం...అసలు నిజంగా ఆయా సంస్థలకు ఎంత భూమి అవసరం అవుతుంది ... ఈ కేటాయింపులు..రాయితీల విషయంలో హేతుబద్దత లేకుండా అధికారంలో ఉన్న వాళ్ళు ఏది అనుకుంటే అదే చేసుకుంటూ పోతున్నారు. ఇది అంతా ఇప్పుడు ఎందుకు అంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రహేజా కార్పొరేషన్ కు కొత్తగా వైజాగ్ లో వందల కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కంపెనీ అడిగిందే తడవుగా ప్రభుత్వం కూడా వైజాగ్ లోని మధురవాడ ఐటి హిల్ లో దగ్గర దగ్గర 27 ఎకరాలు కేటాయించటానికి సిద్ధం అవుతున్నట్లు చెపుతున్నారు. కంపెనీ 2172 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆఫీస్ , రెసిడెన్షియల్ స్పేస్ డెవలప్ చేయనుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు...రహేజా సంస్థకు మధ్య ఉన్న బంధం ఈ నాటిది కాదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలోనే అంటే 2003 లో మాదాపూర్ లో ఏకంగా 110 ఎకరాలను రహేజా సంస్థకు కట్టబెట్టారు. అప్పటిలో మార్కెట్ రేట్ రెండు నుంచి నాలుగు కోట్ల రూపాయల ఉంటే రహేజా సంస్థకు కేవలం 50 లక్షల కు కేటాయించారు. దీంతో పాటు భూమి రేట్ లో కూడా జాబ్ లింక్ పెట్టి ఒక్కో ఉద్యోగానికి మళ్ళీ ఇంత సబ్సిడీ ఇచ్చినట్లు అప్పటిలోనే అధికార వర్గాలు వెల్లడించాయి. అప్పటిలోనే కాంగ్రెస్ నాయకులతో పాటు కొంత మంది అధికారులు దీన్ని ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అతి పెద్ద స్కాం గా అభివర్ణించారు. రహేజా కు కారు చౌకగా భూములు కేటాయించడంపై కాంగ్రెస్ నేతలు అప్పటిలో తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెర వెనక ఏదో జరిగింది ఆరోపణలు అప్పటిలోనే వినిపించాయి. అప్పుడు హైదరాబాద్ లో రహేజా కు కారు చౌకగా భూములు కేటాయించి ఆ కంపెనీ వందల కోట్ల రూపాయలు లాభాన్ని గడించేలా చేసిన చంద్రబాబు ఇప్పుడు అదే సంస్థకు వైజాగ్ లో భూములు కేటాయించటానికి సిద్ధం అయినట్లు కనిపిస్తోంది.

అయితే వైజాగ్ లో కేటాయించే భూముల ధర పై ఇంకా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అని చెపుతున్నారు. కొద్ది నెలల క్రితమే బెంగళూరు కు చెందిన సత్వా గ్రూప్ కు వైజాగ్ లో ఎకరా కోటిన్నర రూపాయల లెక్కన 30 ఎకరాలు కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ డెవలపర్లకు కూడా కారు చౌకగా ప్రభుత్వ భూములు కేటాయిస్తూ పోతూ రాష్టానికి పెట్టుబడులు సాధించాం అని చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్. సత్వా తో పాటు ఇప్పుడు చంద్రబాబు కు ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్న రహేజా కూడా రంగంలోకి దిగింది. వీళ్ళు పూర్తిగా ప్రైవేట్ స్పేస్ డెవలపర్లు మాత్రమే. దేశంలోనే నంబర్ వన్ ఐటి కంపెనీ అయిన టిసిఎస్ లాంటి సంస్థకు 21 ఎకరాలు రూపాయికే కేటాయించినా కూడా కొంతలో కొంత అర్ధం ఉంది. ఎందుకంటే ఆ కంపెనీ కల్పించే ఉద్యోగాలు ఇతర అంశాలు కచ్చితంగా వైజాగ్ ప్రగతికి దోహదపడతాయి. ఈ కంపెనీ 2025 సెప్టెంబర్ తో ముగిసిన మూడు నెలల కాలానికి సాధించిన నికర లాభం ఎంతో తెలుసా?. అక్షరాలా 12075 కోట్ల రూపాయలు.

Next Story
Share it