ప్రతిపాదన రాక ముందే భూ కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారా!

ప్రతిపాదన రాక ముందే భూ కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారా!
ఈ వింతపాలన దేశంలో ఎక్కడా ఉండదేమో!
వందల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను కూటమి సర్కారు ఎంత అడ్డగోలుగా కేటాయిస్తుందో చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..మంత్రి నారా లోకేష్ లు పెట్టుబడులు....ఉద్యోగాల పేరుతో ప్రైవేట్ కంపెనీలకు ఇష్టానుసారం భూములు కేటాయించటానికి నిర్ణయం తీసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు సంస్థలకు భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో కపిల్ గ్రూప్ కు చెందిన బీవిఎంఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదన కూడా ఉంది. ఈ కంపెనీ వైజాగ్ లో 1250 కోట్ల రూపాయల పెట్టుబడితో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాజెక్ట్ ను అమలు చేస్తుంది అని..దీని ద్వారా 15000 ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. మంత్రి వర్గ భేటీ తర్వాత మీడియా సమావేశంలో కూడా మంత్రి కొలుసు పార్ధసారధి వెల్లడించారు. ఈ కంపెనీకి వైజాగ్ లోని ఎండాడ లో ఎకరా కోటిన్నర రూపాయల లెక్కన 30 ఎకరాలు కేటాయించటానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కానీ శుక్రవారం నాడు విడుదల చేసిన జీవో లో ప్రస్తావించిన అంశాలు చూసి ఎవరైనా షాక్ కు గురి అవ్వాల్సిందే. ఈ కంపెనీకి మంత్రి చెప్పినట్లు కాకుండా తొలిదశలో పది ఎకరాలు ఎకరా కోటిన్నర రూపాయల లెక్కన కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 25 లక్షల చదరపు అడుగుల స్పేస్ ను వివిధ విభాగాల కోసం (మిక్సెడ్ డెవలప్ మెంట్)
అభివృద్ధి చేయాలి అన్నారు. కంపెనీ కోరిన మిగిలిన 20 ఎకరాలను మాత్రం ఇంటిగ్రేటెడ్ ఐటి పార్క్ అభివృద్ధికి సంబంధించిన అదనపు ప్రతిపాదన అందిన తర్వాత పరిశీలించాలని నిర్ణయించినట్లు జీఓ లో పేర్కొన్నారు. అసలు కంపెనీ ప్రతిపాదన ఇవ్వక ముందే ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అద్యక్షతన జరిగిన ఎస్ఐపీబి సమావేశంలో ఎలా చర్చించారు?. ఇచ్చిన తర్వాత 20 ఎకరాలు కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటామని పది ఎకరాలు కేటాయించే జీవోలో ప్రస్తావించటం ఏమిటి?. కానీ కేబినెట్ లో మాత్రం 30 ఎకరాల కేటాయింపు..1250 కోట్ల రూపాయల పెట్టుబడి అని చెప్పి...ఇప్పుడు పది ఎకరాల కేటాయింపు జీవో లో అదే పెట్టుబడి...అదే ఉద్యోగాల లెక్కలు ప్రస్తావించటం వెనక మతలబు ఏంటి?. ఇది అంతా ఎవరిని మభ్యపెట్టేందుకు చేస్తున్నారు అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
టిసిఎస్ వంటి కంపెనీకి ఇరవై రెండు ఎకరాలు ఇచ్చి...పెద్దగా ఐటి రంగంలో ఏ మాత్రం అనుభవం లేని బీవిఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఐటి పార్క్ కోసం 20 కేటాయించటానికి సిద్ధం అయ్యారు అంటే ఇందులో పెద్ద స్కాం ఉన్నట్లే లెక్క అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వైజాగ్ లోని ఎండాడ వద్ద ఎకరా భూమి ధర 30 కోట్ల రూపాయల పైనే ఉంటుంది అని...కానీ ఒక ప్రైవేట్ సంస్థ..అది కూడా ఏ మాత్రం పెద్దగా బ్రాండ్ లేని సంస్థ వ్యాపారాలకు ఇలా వందల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని అప్పచెప్పటం అంటే దీని వెనక ఏదో భారీ ప్లాన్స్ ఉండి ఉంటాయి అనే అనుమానాలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. తొలుత ఉర్సా క్లస్టర్స్..ఇప్పుడు అసలు ప్రతిపాదన కూడా రాకముందే ఐటి పార్క్ కు 20 ఎకరాలు కేటాయింపుపై చర్చ చేశారు అంటేనే అసలు విషయం ఏమిటో అర్ధం అవుతుంది అన్నారు. వైజాగ్ లో వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను ప్రైవేట్ కంపెనీలకు ఎడా పెడా కేటాయించుకుంటూ పోతున్నారు.



